Oppo Find N5: ప్రపంచంలోనే అత్యంత పలుచనైన ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో

Worlds thinnest foldable phone Oppo Find N5 launched

  • ‘ఒప్పో ఫైండ్ ఎన్ 5’ పేరుతో ఫోల్డబుల్ ఫోన్‌ను లాంచ్ చేసిన ఒప్పో
  • ముడిచినప్పుడు దాని మందం 8.93 మిల్లీమీటర్లు మాత్రమే
  • గతవారం విడుదలైన ‘ఆనర్ మేజిక్ వీ3’ ఫోన్ రికార్డు బద్దలు
  • ధర రూ. 1.62 లక్షలు
  • భారత మార్కెట్లో విడుదల కాని ఫోన్

ప్రపంచంలోనే అత్యంత పలుచనైన ఫోల్డబుల్ ఫోన్‌ను ఒప్పో లాంచ్ చేసింది. దీనిపేరు ‘ఒప్పో ఫైండ్ ఎన్5’. దీని మందం (ముడిచినప్పుడు) 8.93 మిల్లీమీటర్లు మాత్రమే. 2024లో విడుదలై అత్యంత పలుచనైన ఫోన్‌గా పేరుగాంచిన ‘ఆనర్ మేజిక్ వీ3’ కంటే కూడా ఇది సన్నగా ఉంటుంది. ఫోన్‌ను తెరిస్తే దాని అత్యంత పలుచనైన పాయింట్ వద్ద 4.21 మిల్లీమీటర్లు మాత్రమే ఉంటుంది. దీంతో ప్రపంచంలోనే తమ ఫోన్ అత్యంత పలుచనైనదని ప్రకటించింది. కంపెనీ ఈ ఫోన్‌ను మూసివేసినప్పుడు ఉండే కొలతల ఆధారంగానే తమ ఫోన్ పలుచనిదని పేర్కొంది. ఒకవేళ ఫోన్‌ను తెరిచినప్పుడు ఉండే కొలతల ఆధారంగానైతే గతవారం విడుదలైన ‘హువావే మేట్ ఎక్స్‌టీ ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్’ అత్యంత సన్నగా ఉన్న ఫోన్ అవుతుంది. ఎందుకంటే దాని మందం 3.6 మిల్లీమీటర్లు మాత్రమే.

‘ఒప్పో ఫైండ్ ఎన్5’ను గురువారం లాంచ్ చేశారు. అన్ని యూరోపియన్, ఆసియా మార్కెట్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఒప్పో తన ‘ఫైండ్ ఎన్’ సిరీస్‌ను ఇప్పటి వరకు ఇండియన్ మార్కెట్లో విడుదల చేయలేదు కాబట్టి, తాజా ఫోన్ ఇక్కడ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న దానిపై స్పష్టత లేదు. కాగా, ‘ఒప్పో ఫైండ్ ఎన్5’ ధర దాదాపు 1.62 లక్షలు ఉండే అవకాశం ఉంది. 

‘ఒప్పో ఫైండ్ ఎన్5’ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
అమోలెడ్ డిస్‌ప్లేతో 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్క్రీన్, ప్లస్ 8.1 అంగుళాల 2కే ఎక్స్‌టర్నల్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ ఎల్‌టీపీవో రీఫ్రెష్ రేట్, 2160 హెర్ట్జ్ పీడ్ల్యూఎం డిమ్మింగ్, స్టైలస్ పెన్‌కు అనుకూలమైన డిస్‌ప్లే‌ని తీర్చిదిద్దారు. ఈ ఫోన్‌ ఐపీఎక్స్6, ఎక్స్9 రేటింగ్స్‌తో వస్తోంది. అంటే పూర్తి వాటర్ ఫ్రూఫ్, డస్ట్, డర్ట్ ప్రొటెక్షన్ ఉన్నాయన్న మాట. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఉన్న ఈ ఫోన్‌లో సరికొత్త క్వాల్‌కామ్ చిప్‌సెట్‌ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌ను ఉయోగించారు. 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజీ కలిగి ఉంది. అలాగే 5,600 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఇది 80 వాట్స్ వైర్డ్ చార్జింగ్‌కు, 50 వాట్స్ వైర్‌లెస్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 

అలాగే, ‘ఒప్పో ఫైండ్ ఎన్5’లో ఫొటోలు, వీడియోల రికార్డింగ్  కోసం 50 మెగాపిక్సల్‌ ప్రధాన సెన్సార్‌తో హాసెల్‌బ్లాండ్ బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరాను అమర్చారు. ఇందులో 8 మెగాపిక్సల్‌తో తెరిచినప్పుడు ఒకటి, ముడిచినప్పుడు ఒకటిగా మొత్తం రెండు సెల్ఫీకెమెరాలను ఏర్పాటు చేశారు. కలర్ ఓఎస్ లేయర్‌తో లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ 15ను ఉపయోగించారు. మిస్టీ వైట్, కాస్మిక్ బ్లాక్ డస్కీ పర్పుల్ రంగుల్లో ఫోన్ అందుబాటులో ఉంది. 

  • Loading...

More Telugu News