Chandrababu: డాక్టర్ రాగదీపికకు హృదయపూర్వక అభినందనలు: సీఎం చంద్రబాబు

- ఖగోళ భౌతికశాస్త్రంలో డాక్టర్ రాగదీపిక అద్భుత ఆవిష్కరణ
- రాగదీపిక గుంటూరు జిల్లా తెనాలి ముద్దుబిడ్డ అని చంద్రబాబు వెల్లడి
- ప్రపంచ వేదికపై సత్తా చాటారని కితాబు
భారత సంతతికి చెందిన ప్రఖ్యాత ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ పుచ్చా రాగదీపికను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. అనంత విశ్వంలోని కృష్ణ బిలాల గురించి డాక్టర్ రాగదీపిక సంచలన ఆవిష్కరణలు చేశారని, అందుకు గాను ఆమెకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానని వివరించారు.
రాగదీపిక గుంటూరు జిల్లా తెనాలి ముద్దుబిడ్డ అని చంద్రబాబు వెల్లడించారు. ప్రపంచ వేదికపై తమదైన ముద్ర వేసిన తెలుగు మహిళల సరసన ఇప్పుడు ఆమె కూడా చేరారని కొనియాడారు.
అపారమైన ద్రవ్యరాశి కేంద్రాలైన కృష్ణ బిలాలు, మరగుజ్జు గెలాక్సీల అతి పెద్ద నమూనాను రాగదీపిక తన పరిశోధన ద్వారా గుర్తించారని చంద్రబాబు వివరించారు. ఇది ఖగోళ భౌతికశాస్త్రంలో ఒక మైలురాయి అనదగ్గ ఘట్టం అని అభివర్ణించారు.
డాక్టర్ పుచ్చా రాగదీపిక, ఆమె బృందం మరిన్ని ఆవిష్కరణలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.