Perni Nani: గ్రామ స్థాయి లీడర్ల భార్యల ఫోన్ నెంబర్లతో ఏం పని?: పేర్ని నాని

- కూటమి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేస్తోందన్న పేర్ని నాని
- వైసీపీ నేతలు, కార్యకర్తల ఫోన్ నెంబర్లు సేకరిస్తున్నారని మండిపాటు
- చంద్రబాబు బంధువు ఈ పనులు చేస్తున్నారని ఆరోపణ
కూటమి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతోందని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. తన ఫోన్ ను కూడా ట్యాప్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తల ఫోన్ నెంబర్లను సేకరిస్తున్నారని దుయ్యబట్టారు. తమ పార్టీకి చెందిన గ్రామ స్థాయి నాయకుల భార్యల ఫోన్ నెంబర్లను కూడా సేకరిస్తున్నారని... వాళ్ల ఫోన్ నెంబర్లతో ఏం పని అని ప్రశ్నించారు. విజయవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని... ఆయన భార్య పంకజశ్రీ, పేర్ని నాని, ఇతర వైసీపీ నేతలు ఈరోజు ములాఖత్ ద్వారా పరామర్శించారు. అనంతరం మీడియాతో పేర్ని నాని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఫోన్లు ట్యాప్ చేసి బెదిరించాలని చూస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు. తాము భయపడే ప్రసక్తే లేదని చెప్పారు. విజయవాడ రమేశ్ ఆసుపత్రి వద్ద ఆఫీసు పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు బంధువైన ప్రకాశ్ అనే వ్యక్తి అనధికారికంగా ఈ పనులు చేస్తున్నాడని ఆరోపించారు. తప్పులు చేస్తున్న వాళ్లందరినీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.