Botsa Satyanarayana: మిర్చి యార్డుకు వెళ్లడం ఇల్లీగల్ యాక్టివిటీ అయితే... మ్యూజికల్ నైట్ కు వెళ్లడం ఏ యాక్టివిటీ?: బొత్స

- కూటమి ప్రభుత్వానికి రైతులంటే గౌరవం లేదన్న బొత్స
- జగన్ పర్యటన తర్వాతే మిర్చి రైతుల సమస్యలు ప్రభుత్వానికి తెలిశాయని వ్యాఖ్య
- షర్మిల వ్యక్తిగత అజెండాతో మాట్లాడుతున్నారని విమర్శ
కూటమి ప్రభుత్వానికి రైతులన్నా, వ్యవసాయమన్నా గౌరవం లేదని వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. తమ అధినేత జగన్ నేరుగా మిర్చి యార్డుకు వెళ్లి మిర్చి రైతులు పడుతున్న ఇబ్బందిని అడిగి తెలుసుకున్నారని తెలిపారు. జగన్ పర్యటన తర్వాతే మిర్చి రైతుల సమస్యలు ప్రభుత్వానికి తెలిశాయని చెప్పారు. జగన్ వెళితే కానీ మిర్చి రైతుల సమస్యలు ప్రభుత్వానికి తెలియలేదా? అని ప్రశ్నించారు.
మిర్చి రైతుల సమస్యలను తెలుసుకోవడానికి జగన్ వెళితే... ఆ పర్యటనను ఇల్లీగల్ యాక్టివిటీ అంటున్నారని మండిపడ్డారు. మరి మ్యూజికల్ నైట్ కు వెళ్లడం ఏ యాక్టివిటీ అవుతుందని ప్రశ్నించారు. మిర్చి యార్డుకు వెళ్లవద్దని ఎన్నికల కమిషన్ చెప్పలేదని అన్నారు.
కోడి కత్తి కేసులో జగన్ హాజరుకాకపోతే కోర్టు నిర్ణయం తీసుకుంటుందని బొత్స చెప్పారు. భూ కుంభకోణాలపై వేసిన సిట్ నివేదికను ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల వ్యక్తిగత అజెండాతో మాట్లాడుతున్నారని... రాజకీయాల్లో వ్యక్తిగత అజెండాలకు తావు లేదని చెప్పారు.
సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉందని తెలిపారు.