Harbhajan Singh: స్పిన్ బౌలింగ్ లో కోహ్లీ తడబాటుకు కారణం ఇదే: హర్భజన్ సింగ్

- స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్న కోహ్లీ
- స్లో బంతులు, లెగ్గీలు ఆడటానికి ఇబ్బంది పడుతున్నాడన్న హర్భజన్
- స్ట్రైక్ రొటేట్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని సూచన
టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ స్పిన్ బౌలింగ్ లో తడబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇంగ్లండ్ తో సిరీస్ లో అదిల్ రషీద్ బౌలింగ్ లో ఇబ్బంది పడ్డ కోహ్లీ... ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ స్పిన్నర్ రిషద్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం పాకిస్థాన్ తో జరిగే కీలక మ్యాచ్ లో స్పిన్నర్ అబ్రార్ తో కోహ్లీకి ఇబ్బందులు తప్పవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మాట్లాడుతూ... స్లో బంతులు, లెగ్గీలు ఆడటానికి కోహ్లీ ఇబ్బంది పడుతున్నాడని చెప్పాడు. లెగ్ సైడ్ వచ్చే బంతులను ఆడేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించాడు. స్ట్రైక్ ను రొటేట్ చేయడం వల్ల కూడా ఒత్తిడి తగ్గుతుందని చెప్పాడు. క్రీజులో కుదురుకునేంత వరకు సమయం తీసుకోవడం కూడా ముఖ్యమని సూచించాడు.
సింగిల్స్ తీయకుండా క్రీజ్ లో ఉండటం వల్ల కూడా ఒత్తిడి పెరుగుతుందని చెప్పాడు. ఆ సమయంలో భారీ షాట్లకు వెళ్లాలనిపిస్తుందని... అప్పుడు పొరపాట్లు జరిగే అవకాశం ఉందని అన్నాడు. తానేంటో కోహ్లీ ఎవరికీ చూపించుకోవాల్సిన అవసరం లేదని... తన సత్తా ఏంటో నమ్మితే చాలని చెప్పాడు. ఆటను ఆస్వాదిస్తూ వెళితే పరుగులు వాటంతట అవే వస్తాయని తెలిపాడు.