Vallabhaneni Vamsi: వంశీకి వెన్నుపూసలో సమస్య ఉంది... జైల్లో కిందపడుకోలేకపోతున్నాడు: పేర్ని నాని

- విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ
- నేడు జైల్లో వంశీని కలిసిన పేర్ని నాని
- ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి
విజయవాడ జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైసీపీ నేత పేర్ని నాని నేడు పరామర్శించారు. వల్లభనేని వంశీతో ములాఖత్ అనంతరం జైలు బయటికి వచ్చిన పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. వంశీ జైల్లో బాగా ఇబ్బందిపడుతున్నాడని విచారం వ్యక్తం చేశారు. ఆరోగ్యం బాగా లేనందున జైల్లో కింద పడుకోలేకపోతున్నాడని తెలిపారు.
"వంశీకి వెన్నుపూసలో సమస్య ఉంది. అందుకే జైల్లో నేల మీద పడుకోలేకపోతున్నాడు. జైల్లో ఏదైనా గట్టు లేదా అరుగు ఉండే గది కేటాయించమని వంశీతో పాటు ఆయన శ్రీమతి కూడా జైలు అధికారులను రిక్వెస్ట్ చేశారు. వారి విజ్ఞప్తిని పరిశీలిస్తామని జైలు అధికారులు చెప్పారు.
వంశీ కేసులో కిందిస్థాయి పోలీసుల నుంచి పోలీసు ఉన్నతాధికారుల వరకు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. పాలన చేస్తున్న రాజకీయ నేతలను సంతృప్తిపరచడం కోసం, వారిని మానసికంగా ఆనందింపజేయడం కోసం పోలీసులు దారుణంగా కేసులు కడుతున్నారు.
సత్యవర్ధన్ అనే వ్యక్తి 10వ తేదీన కోర్టుకు హాజరై... తనతో తప్పుడు కేసు పెట్టించారని జడ్జితో చెప్పుకున్నాడు. ఆ తర్వాత 11వ తేదీన ఐదు కంటే ఎక్కువ క్రిమినల్ కేసుల్లో ముద్దాయిగా ఉన్న ఫణికుమార్ అనే కరడుగట్టిన టీడీపీ కార్యకర్తతో ఫిర్యాదు చేయించారు. పోలీసులను, కోర్టులను తప్పుదోవ పట్టించారంటూ సత్యవర్ధన్ పై, వంశీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
12వ తేదీన సత్యవర్ధన్ అన్న కిరణ్ నుంచి మరో ఫిర్యాదు తీసుకుని వంశీపై మళ్లీ కేసు నమోదు చేశారు. ఊహాజనిత అంశాలతో నాన్ బెయిలబుల్ సెక్షన్లతో తప్పుడు కేసు బనాయించారు. వంశీని అరెస్ట్ చేసి, రిమాండ్ కు పంపాక... ఆ సెక్షన్లకు అనుగుణంగా ఫిర్యాదును మార్చారు. ఇంతకంటే తప్పుడు కేసు ఇంకేముంటుంది?" అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు.