TTD-Naresh Kumar: టీటీడీ ఉద్యోగికి క్షమాపణలు చెప్పిన బోర్డు సభ్యుడు నరేశ్ కుమార్!

- శ్రీవారి ఆలయంలో ఉద్యోగిని దూషించిన టీటీడీ సభ్యుడు నరేశ్ కుమార్
- రెండ్రోజులుగా టీటీడీ ఉద్యోగుల నిరసనలు
- నేడు ఉద్యోగ సంఘాలతో టీటీడీ అధికారుల సమావేశం
ఇటీవల తిరుమలశ్రీవారిని దర్శించుకుని ఆలయం నుంచి వెలుపలికి వచ్చే సమయంలో టీటీడీ బోర్డు సభ్యుడు నరేశ్ కుమార్ ఓ ఉద్యోగిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. నరేశ్ కుమార్ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. టీటీడీ ఉద్యోగులు గత రెండ్రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు.
ఈ క్రమంలో, నేడు ఉద్యోగ సంఘాలతో టీటీడీ ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. టీటీడీ ఉద్యోగి బాలాజీ సింగ్ పై బోర్డు సభ్యుడు నరేశ్ కుమార్ చేసిన దూషణల పట్ల ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ఉద్యోగి బాలాజీ సింగ్ కు టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేశ్ కుమార్ క్షమాపణ చెప్పారు. నరేశ్ కుమార్ క్షమాపణ చెప్పడంతో ఈ వివాదం ఇంతటితో ముగిసినట్టయింది.
కాగా, ఈ వ్యవహారంపై టీటీడీ ఉద్యోగి బాలాజీ సింగ్ స్పందిస్తూ... తనకు ఎదురైన అనుభవం పట్ల మూడు రోజుల పాటు ఎంతో బాధపడ్డానని వెల్లడించారు.