Kollu Ravindra: జగన్ చేస్తున్న ఐప్యాక్ డ్రామాలను ప్రజలు ఛీ కొడుతున్నారు: కొల్లు రవీంద్ర

- ప్రజలు రోడ్డు మీద నిలబెట్టినా జగన్ లో మార్పు రాలేదన్న రవీంద్ర
- జగన్ ఏం మాట్లాడుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదని ఎద్దేవా
- ఎన్నికల కోడ్ ఉన్నా మిర్చి యార్డుకు వెళ్లారని మండిపాటు
వైసీపీ అధినేత జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర మరోసారి విరుచుకుపడ్డారు. పోలీసులను బెదిరించే నీచ రాజకీయాలకు జగన్ తెరలేపారని మండిపడ్డారు. దళిత యువకుడిని కిడ్నాప్ చేస్తే పోలీసులు కేసు పెట్టరా? అని ప్రశ్నించారు. ప్రజలు గుడ్డలు ఊడదీసి రోడ్డు మీద నిలబెట్టినా జగన్ లో మార్పు రాలేదని అన్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో కూడా ఎవరికీ అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అధికారులు చెప్పినా... రాజకీయ స్వార్థం కోసం గుంటూరు మిర్చి యార్డుకు జగన్ వెళ్లారని రవీంద్ర విమర్శించారు. పెయిడ్ ఆర్టిస్టులను రైతులుగా నిలబెట్టి ఐప్యాక్ డ్రామాలు చేశారని మండిపడ్డారు. జగన్ చేస్తున్న ఐప్యాక్ డ్రామాలను ప్రజలు ఛీ కొడుతున్నారని అన్నారు.
మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... అధికారం లేకపోతే ప్రజాసేవ చేయలేరా? అని ప్రశ్నించారు. తాము ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ప్రజలకు జవాబుదారీగానే ఉన్నామని చెప్పారు. జగన్, వైసీపీ నేతల అరాచకాలు, విధ్వంసం, అవినీతితో నాశనమైన కృష్ణా జిల్లా ఖ్యాతిని తిరిగి తీసుకొచ్చేందుకు తామంతా కష్టపడుతున్నామని అన్నారు.