Revanth Reddy: ఏటా మహిళలకు అలాంటి రెండు చీరలు ఇస్తాం: రేవంత్ రెడ్డి

Revanth Reddy says will give two sarees for every year
  • ఆడపడుచు వస్తే ఎలాంటి చీర పెడతామో అలాంటి నాణ్యత కలిగిన చీర ఇస్తామన్న సీఎం
  • మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వం లక్ష్యమని వ్యాఖ్య
  • మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగాలన్న ముఖ్యమంత్రి
మహిళా సమాఖ్య సభ్యులకు ఇక నుంచి ప్రతి ఏటా రెండు చీరలు ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో పిట్టలను బెదిరించేందుకు పంట పొలాల చుట్టూ కట్టే నాణ్యతలేని చీరలు ఇచ్చారని, కానీ ఇప్పుడు సొంత ఆడపడుచు పండుగపూట ఇంటికి వస్తే ఎలాంటి మంచి చీరను పెడతామో అలాంటి నాణ్యతతో కూడిన చీరలను ఇస్తామని ఆయన తెలిపారు. నారాయణపేట జిల్లాలోని అప్పక్‌పల్లెలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ముఖ్యమంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వం లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం మహిళా సంఘాలను పట్టించుకోలేదని విమర్శించారు. మహిళా సంఘాలు ఆర్థికంగా మరింతగా ఎదగాలని అన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేయాలని నిర్ణయించామని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సమాఖ్యలో 67 లక్షల మంది ఉన్నట్లు చెప్పారు. ఈ సభ్యులకు ఇక నుంచి రూ. 1,000 కోట్ల ఖర్చుతో ఏడాదికి రెండు చీరలు ఇస్తామని వెల్లడించారు.

హైదరాబాద్‌లోని శిల్పారామం వద్ద మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుకోవడానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. దీనిని మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తొలుత ప్రతి జిల్లాలో ఒకచోట ప్రభుత్వ భూముల్లో మహిళా సమాఖ్యలకు పెట్రోల్ బంకులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కటైనా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

గ్రామాలలో పాఠశాలల నిర్వహణ బాగుండేలా మహిళలు చొరవ తీసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో వసతులు సరిగ్గా లేకపోయినా, ఉపాధ్యాయులు లేకపోయినా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. నిధులను ప్రభుత్వం ఇస్తుందని, నిర్వహణ మాత్రం మహిళలదే బాధ్యత అన్నారు. నిధులు ఇచ్చినా నిర్వహణ లేకపోతే ప్రయోజనం లేదని ఆయన అన్నారు.
Revanth Reddy
Telangana
Congress

More Telugu News