Rakhi Sawant: రాఖీ సావంత్ కు సమన్లు జారీ చేసిన మహారాష్ట్ర సైబర్ సెల్

- యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా షోకు సంబంధించిన కేసు
- ఈనెల 27న మహారాష్ట్ర సైబర్ సెల్ ముందు హాజరు కావాలని రాఖీకి నోటీసులు
- ఇప్పటి వరకు 42 మందికి నోటీసులు జారీ చేశామన్న ఐజీ యశస్వి యాదవ్
యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా 'ఇండియాస్ గాట్ లాటెంట్' కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఆయనపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా ఇదే కేసులో బాలీవుడ్ నటి రాఖీ సావంత్ కు మహారాష్ట్ర సైబర్ సెల్ సమన్లు జారీ చేసింది. స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఈనెల 27న మహారాష్ట్ర సైబర్ సెల్ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
'ఇండియాస్ గాట్ లాటెంట్' వివాదాస్పద ఎపిసోడ్ లో రాఖీ సావంత్ పాల్గొనకపోయినప్పటికీ... గతంలో నిర్వహించిన ఎపిసోడ్లకు ఆమె అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఐజీ యశస్వి యాదవ్ మాట్లాడుతూ... షోలోని అన్ని ఎపిసోడ్ లలో పాల్గొన్న వారందరి పైనా ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయని... అందులో భాగంగానే రాఖీకి నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు నటులు, నిర్మాతలు సహా మొత్తం 42 మందికి నోటీసులు జారీ చేశామని చెప్పారు. రణవీర్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఫిబ్రవరి 24న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఆయనకు నోటీసులు ఇచ్చారు.
కేసు వివరాల్లోకి వెళితే... ఈ షోలో పాల్గొన్న ఒక వ్యక్తిని తల్లిదండ్రుల శృంగారం గురించి రణవీర్ ప్రశ్నించాడు. దీంతో, ఆయనపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. పార్లమెంట్ సభ్యులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. పలు రాష్ట్రాల్లో ఆయనపై ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ఈ కేసులపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా... సర్వోన్నత న్యాయస్థానం ఆయనను తీవ్రంగా మందలించింది. ఇప్పటి వరకు నమోదైన కేసులపై విచారణ జరపాలని... కొత్తగా మరో కేసు నమోదు చేయవద్దని పోలీసులను ఆదేశించింది.