old woman sanju devi: తల్లిని ఇంట్లో బంధించి.. పుణ్యం కోసం కుంభమేళాకు వెళ్లిన పుత్రరత్నం!

- మూడు రోజుల పాటు ఆహారంగా కాసిన్ని అటుకులే
- ఆకలి బాధకు తాళలేక ప్లాస్టిక్ తినేందుకు యత్నం
- ఇంట్లోంచి కేకలు వినిపించడంతో రక్షించిన ఇరుగుపొరుగు
జన్మనిచ్చిన తల్లి వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఆమెను ఇంట్లో బంధించి భార్యా పిల్లలు, అత్తామామలను వెంటబెట్టుకొని మహా కుంభమేళాకు వెళ్లాడు ఆ కుమారుడు. ఇది జరిగిన మూడు రోజులకు ఆకలి బాధకు తాళలేక ఆమె పెడుతున్న కేకలు విని ఇరుగుపొరుగు వారు రక్షించారు. మానవతావాదులను ఆలోచింపజేసేలా ఉన్న ఈ ఘటన ఝార్ఖండ్‌లో వెలుగుచూసింది.
బాధితురాలు రామ్‌గఢ్ జిల్లా కేంద్రానికి చెందిన 65 ఏళ్ల సంజూదేవి. ఇంట్లో ఆమెను ఒక్కదాన్నే ఉంచి బయట నుంచి తాళం వేసి, భార్యా పిల్లలు, అత్తామామలను తీసుకుని సోమవారం ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లిపోయాడు ఆమె కుమారుడు అఖిలేశ్ కుమార్ ప్రజాపతి. ఆ రోజు నుంచి ఆమె అటుకులే తింటోంది. ఆ కాసిన్ని అటుకులూ అయిపోవడంతో ఆకలికి తాళలేక ప్లాస్టిక్ తినేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో బుధవారం ఇంట్లోంచి బిగ్గరగా కేకేలు, ఏడుపు వినిపించడంతో పక్కింటివాళ్లు మరో చోట ఉంటున్న ఆమె కుమార్తె చాందినీ దేవికి విషయాన్ని తెలియపరిచారు. ఆమె పోలీసులకు సమాచారమివ్వడంతో వారొచ్చి తాళం పగులగొట్టి బాధితురాలిని బయటకు తెచ్చారు.
పొరుగింటి వారు ఆమెకు భోజనం పెట్టి.. సపర్యలు చేసి.. చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే తల్లికి ఇంట్లో భోజనం కోసం అన్ని ఏర్పాట్లు చేసే.. తాము ప్రయాగ్ రాజ్ వెళ్లామని కుమారుడు అఖిలేశ్ కుమార్ సమర్థించుకున్నాడు. అనారోగ్యంతో ఉండటంతోనే ఆమెను తమవెంట తీసుకెళ్లలేదని చెప్పాడు.