Kochi Airport: బెడిసికొట్టిన జోక్.. కటకటాల్లోకి తోసిన పోలీసులు!

--
కేరళలోని కొచ్చిన్ విమానాశ్రయంలో భద్రతా సిబ్బందితో ఓ ప్రయాణికుడు జోక్ చేశాడు. అధికారులు మాత్రం దానిని సీరియస్ గా తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కట్ చేస్తే విమానం ఎక్కి విదేశాలకు వెళ్లాల్సిన సదరు ప్రయాణికుడు పోలీస్ జీప్ లో స్టేషన్ కు, ఆపై లాకప్ లోకి వెళ్లాడు.
బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. కోజికోడ్ కు చెందిన రషీద్ అనే వ్యక్తి కౌలాలంపూర్ వెళ్లేందుకు బుధవారం రాత్రి కొచ్చిన్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాడు. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో సెక్యూరిటీ చెకప్ కు వెళ్లాడు. రషీద్ లగేజీ చెక్ చేసిన భద్రతాధికారులు ఆయన బ్యాగుపై అనుమానం వ్యక్తం చేశారు. బ్యాగు చాలా బరువుంది.. లోపల ఏముందని అడగారు.
దీనికి తిన్నగా సమాధానం చెప్పకుండా ‘లోపల బాంబ్ ఉంది’ అంటూ రషీద్ జోక్ చేశాడు. తాను జోక్ చేశానని రషీద్ భావించాడు కానీ, అధికారులు మాత్రం సీరియస్ గా స్పందించారు. అతని లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేసిన భద్రతా సిబ్బందికి అనుమానాస్పద వస్తువులేవీ కనిపించకపోయినప్పటికీ, పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు రషీద్ ను స్టేషన్ కి తీసుకెళ్లి, కాసేపు లాకప్ లో ఉంచి, తర్వాత వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టారు.