Suicide: భారత్‌లో ముప్పై ఏళ్లలో 30 శాతానికి పైగా తగ్గిన ఆత్మహత్యలు

- 1990లో ప్రతి లక్ష మందికి 18.9 శాతం ఆత్మహత్యలు
- 2021 నాటికి 13 శాతానికి తగ్గిన ఆత్మహత్యలు
- ఆత్మహత్యకు పాల్పడిన వారిలో పురుషులే ఎక్కువ
భారత్‌లో 1990తో పోలిస్తే 2021 నాటికి ఆత్మహత్యలు 30 శాతానికి పైగా తగ్గినట్లు 'ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్' తన నివేదికలో పేర్కొంది. 1990లో ఆత్మహత్యల రేటు ప్రతి లక్ష మందికి 18.9 శాతం ఉండగా, 2019 నాటికి 13.1 శాతానికి, 2021 నాటికి 13 శాతానికి తగ్గిందని ఈ నివేదిక పేర్కొంది. మూడు దశాబ్దాల్లో ఆత్మహత్యల రేటు 31.5 శాతం తగ్గినట్లు వెల్లడించింది. ఈ కాలంలో పురుషుల కంటే మహిళల ఆత్మహత్య రేటు ఎక్కువగా తగ్గినట్లు తెలిపింది.
1990లో ప్రతి లక్ష మంది జనాభాకు 16.8 మంది మహిళల ఆత్మహత్యలు నమోదయ్యాయని, 2021లో ఇది 10.3కి తగ్గిందని తెలిపింది. అదే సమయంలో 1990లో పురుషుల ఆత్మహత్యలు 20.9గా ఉండగా, 2021 నాటికి 15.7గా నమోదైనట్లు తన నివేదికలో వెల్లడించింది.
2020లో చదువుకున్న మహిళలు అత్యధికంగా ఆత్మహత్య చేసుకున్నారని ఈ నివేదిక తెలిపింది. ఇందులో ఎక్కువ మంది కుటుంబ సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 7,40,000 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని ఈ నివేదిక తెలిపింది. ప్రతి 43 సెకన్లకు ఒకరు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నట్లు నివేదిక తెలిపింది.