Israel: ఇజ్రాయెల్‌లో మూడు బస్సులలో పేలుళ్లు.. ఉగ్రదాడిగా అనుమానం

Three buses explodes in Israel suspect terror attack

  • బాట్‌యామ్ నగరంలో మూడు బస్సుల్లో పేలుళ్లు
  • పాలస్తీనా ఉగ్రవాద సంస్థల పనేనని అనుమానం
  • నలుగురు బందీల మృతదేహాలను హమాస్ అప్పగించిన కాసేపటికే ఘటన

బస్సు పేలుళ్లతో ఇజ్రాయెల్ మళ్లీ ఉలిక్కిపడింది. బాట్‌యామ్ నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో నిన్న సాయంత్రం మూడు బస్సులు ఒక్కసారిగా పేలిపోయాయి. అధికారులు దీనిని ఉగ్రదాడిగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలాలకు చేరుకున్న బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. అనుమానితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

నలుగురు బందీల మృతదేహాలను ఇజ్రాయెల్‌కు హమాస్ అందించిన కాసేపటికే ఈ పేలుళ్లు జరగడం గమనార్హం. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా బందీల విడుదల కొనసాగుతోంది. ఇందులో భాగంగా చనిపోయిన 8 మంది బందీల్లో తొలి విడత నలుగురి మృతదేహాలను నిన్న అప్పగించింది.

కాగా, రష్యన్ ఎక్కువగా మాట్లాడే బాట్‌యామ్‌లో జరిగిన బస్సు పేలుళ్లకు పాలస్తీనా ఉగ్రవాద సంస్థలే కారణమని ఇజ్రాయెల్ భద్రతా బలగాలు ఆరోపించాయి. మూడు బస్సులు పేలిపోగా, మరో బస్సులో పెట్టిన బాంబులను బాంబ్‌స్క్వాడ్ గత రాత్రి నిర్వీర్యం చేసింది. కాగా, ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.

More Telugu News