Yuzvendra Chahal: విడిపోయిన యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీవర్మ.. విడాకులు మంజూరు చేసి కోర్టు.. ధనశ్రీ ఎమోషనల్ పోస్ట్!

Yuzvendra Chahal and Dhanashree Verma are now divorced
  • చాహల్-ధనశ్రీ విడిపోతున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు
  • 18 నెలలుగా దూరంగా ఉంటున్న జంట
  • విడాకులు మంజూరు చేసిన బాంద్రా ఫ్యామిలీ కోర్టు
టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడిపోతున్నారంటూ గత కొన్ని రోజులుగా షికారు చేస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్ పడింది. వారిద్దరూ ఇప్పుడు అధికారికంగా విడిపోయారు. విడాకులకు సంబంధించిన చట్టపరమైన ప్రక్రియ పూర్తికావడంతో వారి వివాహ బంధం ముగిసింది.

నిన్న ఉదయం 11 గంటలకు ధనశ్రీవర్మ, చాహల్ ఇద్దరూ ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఇద్దరూ కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. 45 నిమిషాల పాటు కౌన్సెలింగ్ జరిగింది. ఆ తర్వాత కూడా తామిద్దరం విడిపోవడానికే నిశ్చయించుకున్నట్టు కోర్టుకు తెలిపారు. పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్టు చెప్పారు.

గత 18 నెలలుగా తామిద్దరం వేర్వేరుగా ఉంటున్నట్టు తెలిపారు. ఇద్దరి మధ్య పొసగకపోవడమే ఇందుకు కారణమని వివరించారు. విచారణ అనంతరం న్యాయమూర్తి విడాకులు మంజూరు చేశారు. ఇకపై వారి వివాహం చెల్లదని సాయంత్రం 4.30 గంటలకు న్యాయమూర్తి ప్రకటించారు. 

అనంతరం ధనశ్రీ సోషల్ మీడియాలో పోస్టు పెడుతూ.. మనం పడే బాధలు, ఎదుర్కొనే పరీక్షలను కొన్నాళ్ల తర్వాత దేవుడు ఆశీర్వాదాలుగా మార్చగలడని పేర్కొంది. ‘‘మీరు ఈ రోజు ఏదైనా విషయం గురించి ఒత్తిడి, ఆందోళనకు గురైతే మీకు మరో అవకాశం ఉందన్న విషయం తెలుసుకోండి. బాధలను మర్చిపోయి దేవుడిని ప్రార్థించండి. ఆయనపై మీకున్న విశ్వాసమే మీకు మంచి జరిగేలా చేస్తుంది’’ అని ధనశ్రీ రాసుకొచ్చింది. ‘ఒత్తిడి నుంచి ఆశీర్వాదం వరకు’ అని ఈ పోస్టుకు క్యాప్షన్ తగిలించింది.
Yuzvendra Chahal
Dhanashree Verma
Team India
Divorce

More Telugu News