Gummadi Narsaish: ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా, సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ మాత్రం దొరకడం లేదు: గుమ్మడి నర్సయ్య

- ప్రజా సమస్యలను విన్నవించేందుకు సీఎంను కలిసేందుకు ప్రయత్నించినట్లు వెల్లడి
- సీఎంను కలిసేందుకు నాలుగుసార్లు ప్రయత్నించానన్న నర్సయ్య
- సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారిన వీడియో
ఐదుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన తనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ మాత్రం దొరకడం లేదని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను విన్నవించేందుకు తాను ముఖ్యమంత్రిని కలిసేందుకు నాలుగుసార్లు ప్రయత్నించి విఫలమయ్యానని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడిన ఓ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది.
తెలిసిన నేతలు, అధికారులకు ఫోన్ చేస్తే రమ్మని చెబుతున్నారని, హైదరాబాద్ వచ్చాక ముఖ్యమంత్రిని కలిసే అవకాశం మాత్రం దొరకడం లేదని వాపోయారు. సీతారామ ప్రాజెక్టు, పోడు భూములు, చెక్ డ్యాంలు, ఎత్తిపోతల పథకాల సమస్యలను ముఖ్యమంత్రికి వెల్లడించాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. సిబ్బంది ఇంటి గేటు వద్దనే తనను నిలిపివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.