Chandrababu: మిర్చి ధర పతనంపై కేంద్రంతో మాట్లాడా... ఆందోళన వద్దు: ఢిల్లీలో చంద్రబాబు

Chandrababu promises to mirchi farmers

  • మిర్చి ధర పతనంపై కేంద్రమంత్రితో మాట్లాడినట్లు వెల్లడి
  • రైతులను ఆదుకుంటామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
  • అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతోనే మిర్చి ధర పతనమైందన్న చంద్రబాబు
  • పోలవరం పురోగతి, కేంద్రసాయంపై జలశక్తి మంత్రితో చర్చించినట్లు వెల్లడి
  • పోలవరం నీళ్లు బనకచర్లకు తీసుకెళ్లేందుకు కేంద్ర సాయం కోరామన్న ముఖ్యమంత్రి
  • వృథాగా సముద్రంలోకి పోయే నీటినే ఏపీ ఉపయోగించుకుంటోందని స్పష్టీకరణ
  • ఢిల్లీలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

మిర్చి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ధరలు తగ్గడంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ధరలు భారీగా పడిపోయాయన్నారు. గతంలో అంతర్జాతీయ మార్కెట్ బాగుండటంతో రైతులకు మంచి ధర వచ్చిందన్నారు.

ప్రస్తుతం అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో ధరలు పడిపోయాయని, మిర్చి రైతుల సమస్యలను కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లానని ఆయన అన్నారు. కేంద్రమంత్రి పర్యటనలో ఉన్నందున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల సమస్యలను వివరించినట్లు తెలిపారు. శుక్రవారం అధికారులతో కేంద్రమంత్రి సమీక్ష నిర్వహిస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

మిర్చి ధర పతనంపై సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమయ్యారు.

రైతులను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరాం

ఈ యేడాది 12 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి సేకరించాల్సి ఉందని ఆయన అన్నారు. ఇప్పటికే 4 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి మార్కెట్‌కు వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. దాదాపు 5 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది రాష్ట్రంలో మిర్చి సాగైందని, ఎప్పుడూ లేనంతగా రేట్లు పడిపోయాయని ఆయన అన్నారు. ఏ పరిస్థితిలోనూ రైతులను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరామని ముఖ్యమంత్రి తెలిపారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25 శాతం మాత్రమే ఇస్తారని, సాగు ఖర్చులను లెక్కలు వేసి ధరలు నిర్ణయించాలని అన్నారు. అవన్నీ సరిచేయాలని కేంద్రమంత్రిని కోరామని అన్నారు.

దీనిపై శుక్రవారం సమావేశమై చర్చించిన తర్వాత స్పష్టత ఇస్తామని కేంద్రమంత్రి చెప్పారని ముఖ్యమంత్రి తెలిపారు. ఏ విధంగానైనా రైతులను ఆదుకోవడమే ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. శనివారం వ్యాపారులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులతో మాట్లాడి ధరల పతనానికి కారణాలు తెలుసుకుంటామని ఆయన చెప్పారు. ఇప్పటికే కేంద్రానికి మూడు సార్లు లేఖలు రాశామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అధికారులు వచ్చి కేంద్ర అధికారులతో మాట్లాడారని అన్నారు. మిర్చి రైతులను ఆదుకోవాలని కోరడానికి ఢిల్లీకి వచ్చామని, రైతులు నష్టపోకుండా ఏం చేయాలో అది చేస్తామన్నారు.

రైతులను పట్టించుకోని వారు మాట్లాడుతున్నారు

పంటలకు సంబంధించి ధరలు ఒక్కోసారి తగ్గుతాయని, ఒక్కోసారి పెరుగుతాయని ముఖ్యమంత్రి తెలిపారు. రైతులకు గతంలో ఏమీ చేయలేని వారు ఇప్పుడొచ్చి మాట్లాడుతున్నారని విమర్శించారు. 2019కి ముందు ధరలు తగ్గితే దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.138 కోట్లు విడుదల చేసి మిర్చి రైతులను ఆదుకున్నామని ఆయన తెలిపారు. మళ్లీ డబ్బులివ్వబోయేది ఎన్డీయేనే అన్నారు. బాధ్యత లేకుండా మిర్చి యార్డులోకి వెళ్లారని అన్నారు. ఎన్నికల కోడ్ అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుందని ఆయన గుర్తు చేశారు. అక్రమాలు చేసే వారికి రక్షణ ఇవ్వాలా? అని ప్రశ్నించారు.

జల్ జీవన్, పోలవరంపై చర్చ

జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను కూడా కలిసి జల్ జీవన్ మిషన్, పోలవరంపై చర్చించినట్లు చెప్పారు. పోలవరం పనులు సజావుగా సాగుతున్నాయని, 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు అన్నారు. నదుల అనుసంధానంపైనా చర్చించామన్నారు. సముద్రంలోకి వృథాగా వెళ్లే నీరు ఉపయోగించుకుంటే రాష్ట్రంలో కరువు లేకుండా ఉంటుందని అన్నారు. పోలవరం నుంచి బనకచర్ల నీళ్లు తీసుకెళ్లేందుకు కేంద్ర సహకారం కోరామని, దీనిపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రతినిధులు కూడా రాష్ట్రానికి వస్తారని చెప్పారు.

జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా ఇంటింటికీ కుళాయి నీటిని అందించాలన్నది తమ లక్ష్యమని ఆయన అన్నారు. కానీ గత ప్రభుత్వం ఈ పథకాన్ని ఒక్క శాతం కూడా ఉపయోగించుకోలేదని విమర్శించారు. రాష్ట్రానికి రూ. 27 వేల కోట్లను కేంద్రం మంజూరు చేసిందని అన్నారు. పైపులైన్ల ద్వారా కాకుండా బోరు బావుల ద్వారా ఇస్తామని చెప్పారు. కేంద్రం ఇచ్చిన రూ.50 వేల కోట్ల నిధులను ఉత్తరప్రదేశ్ ఖర్చు చేసిందని, గుజరాత్‌లో ఇంటింటికీ కుళాయి ద్వారా నీళ్లు నిరంతరం ఇస్తున్నారని వెల్లడించారు.

కేంద్రం ఈ పథకాన్ని మళ్లీ నిబంధనలు మార్చి 2028కి పనులు పూర్తి చేయాలని సమయం పెంచిందని అన్నారు. దీని ప్రకారం గతంలో కేటాయించిన రూ.27 వేల కోట్లు మాత్రమే వస్తాయని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కుళాయి ద్వారా నీరివ్వాలంటే అదనంగా రూ.54 వేల కోట్లు అవసరమని ఆయన అన్నారు. దీనిపై కూడా కేంద్రంతో మళ్లీ సంప్రదిస్తామని అన్నారు. ప్రస్తుతం రూ.27 వేల కోట్లకు డీపీఆర్ సిద్ధం చేసి కేంద్రాన్ని నిధులు కోరుతామని తెలిపారు.

తప్పుడు విధానాలతో ప్రజలకు నష్టం

గత ప్రభుత్వం అవలంభించిన తప్పుడు విధానాల వల్ల ప్రజలు ఏ విధంగా నష్టపోతారో ఈ జల్ జీవన్ మిషన్ ఒక ఉదాహరణ అని చంద్రబాబు అన్నారు. 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను ఐదేళ్ల పాటు నిర్వీర్యం చేశారని గత ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. వాటిల్లో కొన్ని పథకాలకు మేము వచ్చాక మ్యాచింగ్ గ్రాంట్ కేటాయించి నిధులు ఖర్చు చేసి యూసీలు ఇచ్చామని అన్నారు. కేంద్రం ఇచ్చే పథకాలు ఉపయోగించుకుంటే రాష్ట్రానికి ఎంతో మంచి జరుగుతుందని, కానీ గత ప్రభుత్వ చేతకాని పాలన వల్ల సమస్యలు వచ్చాయన్నారు. వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నామని ముఖ్యమంత్రి అన్నారు.

సముద్రంలో కలిసే నీటినే వాడుకుంటున్నాం

నదులు ప్రవహించే వరుసలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిట్టచివర ఉందని చంద్రబాబు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నేను తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ప్రాజెక్టులు పూర్తి చేసి తెలంగాణకు నీళ్ళందించామని అన్నారు. ఇప్పుడు సముద్రంలోకి వెళ్లే నీరు ఉపయోగించుకోవాలని చూస్తున్నామని, వృధాగా సముద్రంలోకి పోయే నీటిని ఏపీ ఉపయోగించుకునే అవకాశం ఉందని, వాటినే వాడుకుంటున్నామని ఆయన తెలిపారు. ఏపీలో ఎన్డీయే చిత్తశుద్ధితో ప్రజల కోసం పని చేస్తోందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News