KCR: కేసీఆర్ బీజేపీకి, నరేంద్ర మోదీకి భయపడుతున్నారా?: కమ్యూనిస్టు పార్టీల ప్రశ్న

- కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారారాన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం
- కమ్యూనిస్టులను విమర్శించే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదన్న జాన్ వెస్లీ
- కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీకి భయపడుతున్నారా? లేక ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భయపడుతున్నారా? అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రశ్నించారు. కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారారన్న కేసీఆర్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
కమ్యూనిస్టులను విమర్శించే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి లాభం చేకూరేలా కేసీఆర్ వ్యవహరించారని ఆరోపించారు. బీజేపీ పట్ల బీఆర్ఎస్ వైఖరి ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు.
కమ్యూనిస్టులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఖండించారు. కేసీఆర్‌కు సహకరిస్తే కమ్యూనిస్టులు త్యాగధనులు అవుతారు, లేకుంటే ఇతర పార్టీలకు తొత్తులు అవుతారా అని నిలదీశారు. కమ్యూనిస్టులపై చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కమ్యూనిస్టుల త్యాగాలు కేసీఆర్‌కు బాగా తెలుసునని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవి లేకుండా కేసీఆర్ ఉండలేరా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన పోరాడాలని సూచించారు. కమ్యూనిస్టుల అజెండాను తీసుకుంటామని చెప్పి మోసం చేసిన చరిత్ర కేసీఆర్‌ది అన్నారు.