Chandrababu: ఇష్టానుసారం చేస్తానంటే కుదరదు: జగన్ కు చంద్రబాబు కౌంటర్

- ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లడంపై చంద్రబాబు మండిపాటు
- అక్రమాలు చేసేందుకు పోలీసుల రక్షణ ఇవ్వాలంటే ఎలాగని ప్రశ్న
- రౌడీయిజం చేయడం సరికాదని హితవు
వైసీపీ అధినేత జగన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటనకు వెళ్లడంపై సీఎం మండిపడ్డారు. ఈసీ ఆదేశాలను ఉల్లంఘించి ఇష్టానుసారం చేస్తానంటే కుదరదని చెప్పారు. అక్రమాలు చేస్తా... పోలీసుల రక్షణ ఇవ్వాలంటే ఎలాగని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించాలని అన్నారు. రౌడీయిజం చేయడం సరికాదని అన్నారు.
ఈ ఏడాది ఎప్పుడూ లేనంతగా మిర్చి రేట్లు పడిపోయాయని చంద్రబాబు చెప్పారు. విదేశాల్లో డిమాండ్ తగ్గడం వల్ల మిర్చి రేట్లు తగ్గాయని అన్నారు. మిర్చి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. మిర్చి ఎగుమతులు ఎందుకు తగ్గాయో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. సాగు ఖర్చులను రియలిస్టిక్ గా వేసి ధరలు నిర్ణయించాలని అన్నారు. దీనిపై కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో చర్చించామని తెలిపారు. ధరల స్థిరీకరణకు ఏం చేయాలో ఆలోచిస్తామని చెప్పారు. కేంద్ర వాణిజ్యశాఖతో మరిన్ని సంప్రదింపులు జరుగుతాయని తెలిపారు.
కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో పోలవరం ప్రాజెక్టు గురించి చర్చించామని చంద్రబాబు వెల్లడించారు. 2027లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
గత ప్రభుత్వ చేతకానితనం వల్ల కేంద్ర నిధులను వాడుకోలేకపోయామని విమర్శించారు. అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు.