kidney damage: సింపుల్​ అనిపించే ఈ లక్షణాలే... కిడ్నీలు దెబ్బతినడానికి సూచికలు!

are we ignoring the silent signs of kidney damage

  • చాలా మందిలో తెలియకుండానే కిడ్నీ సమస్యలు
  • మారిన జీవన శైలి, ఆహార అలవాట్లే దీనికి కారణమంటున్న నిపుణులు
  • కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే... కిడ్నీలు దెబ్బతిన్నాయనడానికి సూచన అని వెల్లడి

ఇటీవలికాలంలో మారిన జీవన శైలి, ఆహార అలవాట్ల కారణంగా చాలా మందిలో కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. కిడ్నీల పనితీరు దెబ్బతిని డయాలసిస్ పరిస్థితి దాకా వెళుతున్నవారు ఎంతో మంది. అయితే కిడ్నీలు దెబ్బతినడానికి సంబంధించి మన శరీరంలో ముందుగానే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయని... వాటిని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సమస్య తీవ్రతరం కాకుండా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఈ లక్షణాలను జాగ్రత్తగా గమనించండి
కిడ్నీలు దెబ్బతిన్న వారిలో మొదట కనిపించే ప్రాథమిక లక్షణం... కాళ్ల వాపు, ముఖం ఉబ్బిపోవడం. కిడ్నీల పనితీరు దెబ్బతిని, శరీరంలో నుంచి ప్రొటీన్లు బయటికి వెళ్లిపోవడమే దీనికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

మూత్రం నురగలా రావడం...
ఉదయం నిద్రలేవగానే టాయిలెట్ కు వెళ్లినప్పుడు మూత్రం నురగలా రావడం కిడ్నీ సమస్య లక్షణమని నిపుణులు చెబుతున్నారు. అది ‘ప్రొటెన్యురియా’ సమస్య అయి ఉండవచ్చని సూచిస్తున్నారు. ఇక అతి తక్కువగా మూత్రం రావడం, లేదా విపరీతంగా మూత్రం రావడం కూడా కిడ్నీల పనితీరు దెబ్బతినడానికి సంకేతమని పేర్కొంటున్నారు.

మూత్రంలో రక్తం...
కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటం, లేదా మూత్ర నాళ ఇన్ఫెక్షన్లు వంటివి ఏర్పడినప్పుడు మూత్రంలో రక్తం పడటం వంటి సమస్యలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కొందరిలో నొప్పి ఉంటుందని, మరికొందరిలో నొప్పి ఏమీ ఉండదని వివరిస్తున్నారు. కొన్నిసార్లు ఇలా రక్తం పడటం ‘రెనల్ సెల్ కార్సినోమా’గా పిలిచే కేన్సర్ వ్యాధికి సూచిక అయి ఉండవచ్చని చెబుతున్నారు.

ఆకలి తగ్గిపోవడం, తీవ్ర నీరసం...
కిడ్నీల పనితీరు తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు శరీరంలో రక్త హీనత సమస్య ఏర్పడుతుందని... ఇది తీవ్ర నీరసం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలకు కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

తీవ్ర దురదలు...
కిడ్నీల పనితీరు దెబ్బతింటే... శరీరంలో విష పదార్థాలు, వ్యర్థాలు పేరుకుపోతాయని, ఇవి చర్మంపై ప్రభావం చూపిస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చర్మం ఎండిపోవడం, మొటిమలు, తరచూ దురదగా ఉంటుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయని వివరిస్తున్నారు.

ఈ అంశాలను గుర్తుంచుకోండి...
పైన చెప్పిన లక్షణాలు కనిపించినంత మాత్రాన కిడ్నీలు దెబ్బతినిపోయాయని ఆందోళన చెందవద్దని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కొన్ని ఇతర ఆరోగ్య సమస్యలతోనూ ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చని చెబుతున్నారు. అందువల్ల వైద్యులను కలసి, పరీక్షలు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అంతేకాదు... కిడ్నీలు దెబ్బతినే తొలి దశలో కొందరిలో ఎలాంటి లక్షణాలూ కనిపించవని, అందువల్ల ఏటా వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిదని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News