Jagan: మగాళ్ల అందాల గురించి జగన్ మాట్లాడటం ఆందోళన కలిగిస్తోంది: మంత్రి వాసంశెట్టి

- జగన్ కు లండన్ మందులు వికటించినట్టు ఉన్నాయన్న వాసంశెట్టి
- జైలు యాత్రలతో ఖైదీల్లో మంచి క్రేజ్ వచ్చిందని ఎద్దేవా
- రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారన్న ప్రత్తిపాటి
వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ నేతలు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. జగన్ కు సరైన భద్రత కల్పించలేదంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ... జగన్ ఒక ఎమ్మెల్యే మాత్రమేనని, ఆయన ప్రతపక్ష నేత కాదని అన్నారు. జగన్ కు లండన్ మందులు వికటించినట్టు ఉన్నాయని... మగాళ్ల అందాలు, బట్టలిప్పడం వంటి మాటలను జగన్ మాట్లాడుతుండటం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. జైలు యాత్రలతో జగన్ కు ఖైదీలు, వారి కుటుంబ సభ్యుల్లో మంచి క్రేజ్ వచ్చిందని ఎద్దేవా చేశారు.
ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ... 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబుకు జగన్ ఎలాంటి భద్రత కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులపై రాజకీయ స్వలాభం కోసం జగన్ కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో గొంతెత్తలేని వ్యక్తికి రోడ్లపై హంగామా ఎందుకని ఎద్దేవా చేశారు. రైతుల గురించి జగన్ మాట్లాడటం రాజకీయ డ్రామాలో భాగమేనని చెప్పారు.
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గూడపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ... గుంటూరు జిల్లాలో రోజుకొక వైసీపీ నేత పార్టీని వీడుతున్నారని... దీంతో తీవ్ర ఆందోళనలో ఉన్న జగన్ బలప్రదర్శన చేపట్టారని విమర్శించారు. అల్లరి మూకలతో వచ్చిన జగన్... మిర్చి యార్డులో రైతులను ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. రైతులు కష్టపడి పండించిన మిర్చిని వైసీపీ వాళ్లు తొక్కి నాశనం చేశారని విమర్శించారు. యార్డులో మిర్చి నష్టపోయిన రైతులకు జగన్ క్షమాపణ చెప్పి, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.