Uttam Kumar Reddy: ఆరోజు జగన్‌తో కేసీఆర్ స్నేహంగా మెలిగారు!: ఉత్తమ్ కుమార్ రెడ్డి

- జగన్‌తో స్నేహంగా ఉంటూ జలదోపిడీకి సహకరించారని ఆరోపణ
- కృష్ణా జలాల్లో తెలంగాణకు 200 టీఎంసీలు సరిపోతాయని చెప్పారని ఆగ్రహం
- జగన్ హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచినా కేసీఆర్ మౌనంగా ఉన్నారని విమర్శ
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో స్నేహంగా ఉంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన జల దోపిడీకి సహకరించారని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆనాడు ఏపీ ప్రభుత్వం చేసిన జల దోపిడీకి కేసీఆర్ ప్రభుత్వం సహకరించిందని అన్నారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు 200 టీఎంసీలు సరిపోతాయని చెప్పిన ఘనత బీఆర్ఎస్‌దేనని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కృష్ణా జలాల్లో 500 టీఎంసీల కోసం పోరాడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణకు చాలా అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. జగన్ హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచినా, అక్రమంగా ముచ్చుమర్రి నిర్మిస్తున్నా కేసీఆర్ మౌనంగా ఉన్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయి ఉంటే మహబూబ్‌నగర్ జిల్లా అద్భుతంగా ఉండేదని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు రాలేదు కానీ, బీఆర్ఎస్ నేతల జేబులు మాత్రం నిండాయని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే, మేడిగడ్డ కూలిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు పదేళ్లు అధికారంలో ఉండి కనీసం టెలిమెట్రీలు కూడా ఏర్పాటు చేయలేదని ఆయన విమర్శించారు.