Gandra Venkata Ramana Reddy: రాజలింగమూర్తి హత్యతో నాకు సంబంధం లేదు: మాజీ ఎమ్మెల్యే గండ్ర

- మేడిగడ్డ కుంగిపోవడానికి బీఆర్ఎస్ కారణమంటూ కేసు వేసిన రాజలింగమూర్తి
- లింగమూర్తిని నిన్న దారుణంగా హత్య చేసిన దుండగులు
- హత్య వెనుక గండ్ర ప్రమేయం ఉందని ఆరోపిస్తున్న మృతుడి కుటుంబీకులు
మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటూ కేసు వేసిన రాజలింగమూర్తి నిన్న దారుణ హత్యకు గురికావడం సంచలనం రేపింది. ఈ హత్య వెనుక బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హస్తం ఉందని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో గండ్ర మాట్లాడుతూ... రాజలింగమూర్తి హత్యపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన హత్యను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.
రాజలింగమూర్తి హత్యను బీఆర్ఎస్ కు అంటగట్టేందుకు యత్నిస్తున్నారని గండ్ర మండిపడ్డారు. లింగమూర్తిని తానే చంపించానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. హత్యారాజకీయాలను బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రోత్సహించలేదని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీ కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామని తెలిపారు. ఈ హత్యతో తనకు కానీ, బీఆర్ఎస్ కు కానీ ఎలాంటి సంబంధం లేదని... హత్యపై సీబీఐతో లేదా సీఐడీతో విచారణ జరిపించి, దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.