Harish Rao: అందుకే చంద్రబాబు నీళ్లను తరలించుకుపోతున్నారు: హరీశ్ రావు

- రేవంత్ రెడ్డి మాట్లాడటం లేదు కాబట్టే కృష్ణా జలాలు తరలించుకుపోతున్నారని విమర్శ
- కేంద్రమంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి నీళ్లు తెస్తారా? లేదా? అని ప్రశ్న
- బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం వల్లే నీటిని తరలించే పరిస్థితి ఏర్పడిందన్న హరీశ్ రావు
కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనం వహించడం వల్లే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యథేచ్ఛగా నీటిని తరలించుకుపోతున్నారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. కేంద్రమంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి నీళ్లు తెస్తారో లేదో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ భవన్‌లో కృష్ణా జలాల దోపిడీ అంశంపై ఆయన మాట్లాడారు.
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడంతోనే ఆంధ్రప్రదేశ్ నీటిని తరలించుకుపోయే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. బీజేపీ అసలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ వైఖరి తెలంగాణ ప్రజలకు శాపంగా పరిణమించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే నీటి కోసం ప్రధాన మంత్రి కార్యాలయం ఎదుట ధర్నా చేయడానికి కూడా తాను సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.
కృష్ణా జలాలు దోపిడీకి గురవుతుంటే ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు పదవులు ఎందుకని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ చేస్తున్న జల దోపిడీ కిషన్ రెడ్డికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని హితవు పలికారు.