Komatireddy Venkat Reddy: కేసీఆర్ నుంచి ప్రాణభయముంటే ప్రభుత్వాన్ని సంప్రదించండి: మంత్రి కోమటిరెడ్డి

- మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని కేసు వేసిన రాజలింగమూర్తి
- ఇటీవల దారుణ హత్య
- ఈ హత్యపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
- మాజీ ఎమ్మెల్యే చంపించినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని వ్యాఖ్య
మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని కేసు వేసిన రాజలింగమూర్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యపై గాంధీభవన్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డే చంపించినట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని అన్నారు. న్యాయపరంగా వెళ్లాలి కానీ.. చంపేస్తారా అని ప్రశ్నించారు.
మంత్రి కోమటిరెడ్డి ఇంకా మాట్లాడుతూ.. "కేసీఆర్, ఆయన కుటుంబం రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంది. వారి అక్రమాలను బయటపెడితే చంపేస్తారా? రూ. కోట్లు పోతే సంపాదించుకోవచ్చు. ప్రాణాలు పోతే తిరిగి వస్తాయా? కాళేశ్వరం ప్రాజెక్టు దోపిడీపై రాజలింగమూర్తి పోరాడాడు. ఆయన హత్య ఘటనపై సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాం. కేసీఆర్ పై న్యాయపోరాటం చేస్తున్న చక్రధర్‌గౌడ్ కు రక్షణ కల్పిస్తాం. కేసీఆర్ నుంచి ప్రాణభయం ఉన్నవారు ప్రభుత్వాన్ని సంప్రదించాలి" అని కోమటిరెడ్డి అన్నారు.