AP FiberNet: ఏపీ ఫైబర్ నెట్ ఉన్నతాధికారులపై చైర్మన్ వేటు

AP FiberNet Higher Officials Sacked by Chairman GV Reddy
  • 9 నెలలుగా ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదన్న జీవీ రెడ్డి
  • జీఎస్టీ అధికారులు రూ.377 కోట్లు ఫైన్ విధించిన విషయం తనకు చెప్పలేదని వెల్లడి
  • అధికారులు సహకరించడంలేదని ఆరోపణ
కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచినా ఫైబర్ నెట్ కు పైసా ఆదాయం రాలేదని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంస్థలో ఉన్నతాధికారులు సహకరించడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు ఉన్నతాధికారులను తొలగిస్తున్నట్లు గురువారం ప్రకటించారు. ఫైబర్ నెట్ బిజినెస్ హెడ్ గంధంచెట్టు సురేష్, ప్రొక్యూర్మెంట్ అసిస్టెంట్ మేనేజర్ శశాంక్ హైదర్ ఖాన్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ భరద్వాజలకు ఉధ్వాసన పలికినట్లు తెలిపారు.

గత ప్రభుత్వ పెద్దలతో చేతులు కలిపి తొలగించిన ఉద్యోగులకూ జీతాలు చెల్లించారని జీవీ రెడ్డి మండిపడ్డారు. ఫైబర్ నెట్ లో సంస్కరణలు ప్రతిపాదిస్తూ 400 మంది ఉద్యోగులను తొలగించాలని ఆదేశించినా వారు పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ఆదేశాలపై ఎండీ, ఈడీ సంతకాలు చేయలేదన్నారు. ఇటీవల జీఎస్టీ అధికారులు ఫైబర్ నెట్ కు రూ.377 కోట్లు జరిమానా విధించిన విషయాన్ని తన దృష్టికి తీసుకురాలేదని చెప్పారు.

ఈ తొమ్మిది నెలల్లో రాష్ట్రంలో ఒక్క కొత్త కనెక్షన్ కూడా ఇవ్వలేదని, సంస్థకు రూపాయి ఆదాయం రాలేదని తెలిపారు. ఎండీ దినేశ్ కుమార్ ఒక్క ఆపరేటర్ ను కూడా కలవడం లేదని, కనీసం సిబ్బందికి టార్గెట్లు కూడా పెట్టడంలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శలపాలు చేయడానికి గత ప్రభుత్వ పెద్దలతో కలిసి దినేశ్ కుమార్ కుట్ర పన్నినట్లు జీవీ రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. తొలగించిన ఉద్యోగులకు చెల్లించిన జీతాల సొమ్మును దినేశ్ కుమార్ సహా ఇతర ఉన్నతాధికారుల నుంచి వసూలు చేయాలంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP FiberNet
GV Reddy
Higher Officials
Andhra Pradesh

More Telugu News