Vamsi: కస్టడీ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ కోర్టులో వంశీ అఫిడవిట్

- దర్యాఫ్తు చేయకుండానే అరెస్టు చేశారా? అంటూ ప్రశించిన వంశీ
- సమయం వృథా చేయడమే తప్ప కస్టడీ వల్ల ఉపయోగం లేదని వ్యాఖ్య
- ఆర్టికల్ 20(3) ప్రకారం తన వస్తువులను పోలీసులకు అప్పగించనక్కర్లేదని వాదన
‘ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన మరుసటి రోజే ఎక్కడున్నానో ట్రాక్ చేసి నన్ను అరెస్టు చేశారు.. దర్యాఫ్తు చేశాకే అదుపులోకి తీసుకున్నారు. మళ్లీ కస్టడీ ఎందుకు?' అంటూ గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ పోలీసులకు ప్రశ్నలు సంధించారు. పది రోజుల కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను వ్యతిరేకిస్తూ విజయవాడ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో ఆయన వ్యక్తిగత అఫిడవిట్ దాఖలు చేశారు. దర్యాఫ్తు కోసం కస్టడీకి అడుగుతున్నారంటే ఈ కేసులో దర్యాఫ్తు చేయకుండానే తనను అరెస్టు చేశారా? అంటూ నిలదీశారు. ఫిర్యాదుదారు సత్యవర్ధన్ బయటే ఉన్నాడని గుర్తుచేస్తూ అతడిని విచారిస్తే అన్ని విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు.
పోలీసులకు తాను కొత్తగా చెప్పాల్సిందేమీ లేదని స్పష్టం చేస్తూ కస్టడీకి అప్పగించడం సమయం వృథా చేయడమేనని వాదించారు. ఆర్టికల్ 20(3) ప్రకారం తన వస్తువులను పోలీసులకు అప్పగించాల్సిన అవసరం లేదని చెప్పారు. సత్యవర్ధన్‌ను ఏ-5గా పేర్కొంటూ పోలీసులు క్రైం నంబరు 84/2025తో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ కాపీని అఫిడవిట్‌కు జత చేశారు. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా విజయవాడ జైలులో ఉన్న వంశీ.. తనకు ఇంటి నుంచి భోజనం అనుమతించాలని, మంచం కేటాయించాలని అంతకుముందు పిటిషన్ దాఖలు చేశారు. వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసేందుకు రెండ్రోజుల సమయం కావాలని ప్రాసిక్యూషన్ కోరగా కోర్టు సమ్మతించింది.