Maha Kumbh: కుంభమేళాలో మహిళలు స్నానం చేస్తున్న వీడియోల విక్రయం!

- ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ చానళ్లలో మహిళా భక్తులు స్నానం చేస్తున్న, దుస్తులు మార్చుకుంటున్న వీడియోలు
- ఖాతాలను గుర్తించేందుకు ‘మెటా’ సాయాన్ని అర్థించిన పోలీసులు
- ఓ ఖాతాకు సంబంధించిన సమాచారం అందించిన ‘మెటా’
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం మహిళలు స్నానం చేస్తున్న వీడియోలను విక్రయిస్తున్న రెండు సోషల్ మీడియా ఖాతాలపై కేసులు నమోదు చేసింది. యూపీ పోలీస్ చీఫ్ ప్రశాంత్ కుమార్ ఆదేశాలతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.
కుంభమేళాలో మహిళలు స్నానం చేస్తున్న, దుస్తులు మార్చుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ అయినట్టు సోషల్ మీడియా మానిటరింగ్ బృందం గుర్తించింది. ఇది మహిళల గౌరవ మర్యాదలు, గోప్యతను ఉల్లంఘించడమేనని పోలీసులు పేర్కొన్నారు. దీంతో కొత్వాలి కుంభమేళా పోలీస్ స్టేషన్‌లో రెండు సోషల్ మీడియా ఖాతాలపై కేసులు నమోదు చేసినట్టు, చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్టు తెలిపారు.
మహిళా భక్తులు స్నానం చేస్తున్న వీడియోలను పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై ఈ నెల 17న కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆ ఖాతాను గుర్తించేందుకు, ఎవరు? ఎక్కడి నుంచి ఆ ఖాతాను నిర్వహిస్తున్నారన్న సాంకేతిక సమాచారం కోసం పోలీసులు ‘మెటా’ సాయాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఒక ఖాతాకు సంబంధించిన వివరాలను అందుకున్నారు.
మరో కేసు నిన్న నమోదైంది. ఇలాంటి వీడియోలను ఓ టెలిగ్రామ్ చానల్‌లో గుర్తించారు. ఈ చానల్‌పైనా చట్టపరమైన చర్యలకు పోలీసులు సిద్ధమయ్యారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. మహా కుంభమేళాకు సంబంధించి అసభ్య వీడియోలు, తప్పుదారి పట్టించే సమాచార వ్యాప్తి కోసం సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.