YS Jagan: చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్ కు జగన్ ఫోన్

- చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌కు ప్రముఖుల పరామర్శలు
- రంగరాజన్‌కు ఫోన్ చేసి పరామర్శించిన ఏపీ మాజీ సీఎం జగన్
- రంగరాజన్ కుటుంబంపై దాడి బాధాకరమని వ్యాఖ్య
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం కలిగించింది. రంగరాజన్‌పై జరిగిన దాడిని ఉభయ తెలుగు రాష్ట్రాలలోని పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు ఖండించారు. పలువురు ప్రముఖులు రంగరాజన్‌ను స్వయంగా పరామర్శించారు కూడా.
తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి బుధవారం రంగరాజన్‌ను ఫోన్ ద్వారా పరామర్శించారు. రంగరాజన్‌కు ఫోన్ చేసిన వైఎస్ జగన్ దాడి వివరాలు, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలందిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్న రంగరాజన్ కుటుంబంపై దాడి బాధాకరమని అన్నారు.
ఇటీవల చిలుకూరు బాలాజీ ఆలయ సమీపంలోని రంగరాజన్ నివాసానికి వెళ్లిన కొందరు వ్యక్తులు రామరాజ్యంకు మద్దతు ఇవ్వాలని కోరగా, అందుకు ఆయన నిరాకరించడంతో దాడికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తెలంగాణ ప్రభుత్వం ఘటనపై సీరియస్ అయింది. ఈ క్రమంలో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే పలువురు నిందితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.