New Delhi: దేశ రాజధానిని కొత్త శిఖరాలకు తీసుకు వెళతా: ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి రేఖా గుప్తా

- తనపై నమ్మకంతో పార్టీ బాధ్యతలు అప్పగించిందన్న రేఖా గుప్తా
- అగ్ర నాయకత్వం నమ్మకం, మద్దతు తనకు కొత్త శక్తిని ఇచ్చిందని ట్వీట్
- ప్రతి పౌరుడి సంక్షేమం, సాధికారత, సమగ్రాభివృద్ధి కోసం పని చేస్తానని హామీ
బీజేపీ అగ్రనాయకత్వం తనకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని వినియోగించుకొని ఢిల్లీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు నిబద్ధతతో పని చేస్తానని ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి రేఖా గుప్తా పేర్కొన్నారు ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను బీజేపీ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. తొలిసారి షాలిమార్‌బాగ్ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించిన రేఖా గుప్తా ఢిల్లీకి నాలుగో మహిళా ముఖ్యమంత్రి కానున్నారు.
గతంలో బీజేపీ నుండి సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ నుండి షీలా దీక్షిత్, ఆమ్ ఆద్మీ పార్టీ నుండి అతిశీ ముఖ్యమంత్రులుగా పని చేశారు. తనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన అగ్రనాయకత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా పోస్టు చేశారు.
తనపై నమ్మకం ఉంచి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారని, పార్టీ అధిష్ఠానానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. పార్టీ అగ్ర నాయకత్వం నమ్మకం, మద్దతు తనకు కొత్త శక్తిని, ప్రేరణను ఇచ్చాయని రాసుకొచ్చారు. ఢిల్లీలోని ప్రతి పౌరుడి సంక్షేమం, సాధికారత, సమగ్రాభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఢిల్లీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు నిబద్ధతతో పని చేస్తానని పేర్కొన్నారు. కాగా, రేఖా గుప్తాకు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతిశీ అభినందనలు తెలిపారు.