FasTag: ఫాస్టాగ్ నిబంధనపై గందరగోళం.. స్పష్టతనిచ్చిన ఎన్‌హెచ్ఏఐ

- టోల్ ప్లాజాల వద్ద అమల్లోకి కొత్త నిబంధనలు
- 70 నిమిషాల పాటు యాక్టివ్‌గా లేకుంటే లావాదేవీలను తిరస్కరిస్తామని ఎన్‌పీసీఐ మార్గదర్శకాలు
- బ్యాంకుల మధ్య వివాదాల పరిష్కారం కోసమే ఈ సర్క్యులర్ జారీ చేసినట్లు ఎన్‌హెచ్ఏఐ స్పష్టీకరణ
ఫాస్టాగ్‌కు సంబంధించి జనవరి 28న ఎన్‌పీసీఐ జారీ చేసిన మార్గదర్శకాలు జాతీయ రహదారులపై ఉండే టోల్ ప్లాజాలకు వర్తించవని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) స్పష్టత ఇచ్చింది. మొన్నటి నుండి టోల్ ప్లాజాల వద్ద అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు వాహనదారుల్లో గందరగోళానికి దారి తీశాయి. దీంతో ఎన్‌హెచ్ఏఐ వివరణ ఇచ్చింది.
టోల్ ప్లాజా రీడర్ వద్దకు చేరుకునే సమయానికి 60 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఫాస్టాగ్ యాక్టివ్‌గా లేకున్నా, స్కాన్ చేసిన తర్వాత 10 నిమిషాల వరకు యాక్టివ్‌గా లేకున్నా లావాదేవీలను తిరస్కరిస్తామంటూ ఎన్‌పీసీఐ ఇటీవలి మార్గదర్శకాలు జారీ చేసింది. ఇలాంటి సందర్భాల్లో టోల్ ఫీజును రెండింతలు చెల్లించవలసి ఉంటుందని తెలిపింది.
అయితే, వాహనం టోల్ ప్లాజాలను దాటినప్పుడు ఫాస్ట్ ట్యాగ్ స్థితి విషయంలో ఫాస్టాగ్ జారీ చేసిన బ్యాంకు, టోల్ పేమెంట్ అందుకున్న బ్యాంకు మధ్య వివాదాల పరిష్కారాన్ని సులభతరం చేసేందుకు ఎన్‌పీసీఐ ఈ సర్క్యులర్‌ను జారీ చేసినట్లు ఎన్‌హెచ్ఏఐ తెలిపింది.