Jagan: చంద్రబాబుకు సెక్యూరిటీ కూడా లేకుండా చేస్తా: జగన్

- గుంటూరు మిర్చియార్డులో పర్యటించిన జగన్
- ఈసీ ఆదేశాలను లెక్కచేయని వైనం
- మళ్లీ వచ్చేది వైసీపీ అని ధీమా
గుంటూరు మిర్చి యార్డ్ పర్యటనకు వైసీపీ అధినేత జగన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పర్యటనకు అనుమతి లేదని జిల్లా ఎన్నికల అధికారి అయిన జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆయన తన పర్యటనకు వెళ్లారు.
జగన్ తన పర్యటన సందర్భంగా మిర్చి రైతులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రతిపక్ష నేత అయిన తనకు ప్రొటోకాల్ ఇవ్వలేదని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అంటూ... కనీస పోలీస్ భద్రతను కూడా కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ ప్రభుత్వంలో మిర్చి రైతులకు అత్యధిక మద్దతు ధర ఇచ్చామని జగన్ చెప్పారు. ఇప్పుడు రైతు సమస్యలపై మాట్లాడేందుకు వస్తుంటే... తనను అడ్డుకున్నారని మండిపడ్డారు. మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని... అప్పుడు చంద్రబాబుకు సెక్యూరిటీ కూడా లేకుండా చేస్తామని వ్యాఖ్యానించారు. రైతుల కష్టాలు చంద్రబాబుకి పట్టడం లేదని విమర్శించారు.
జగన్ గుంటూరు పర్యటనకు ఈసీ అనుమతిని నిరాకరించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని తెలిపింది. అయినా ఈసీ ఆదేశాలను ఉల్లంఘించి జగన్ గుంటూరు పర్యటన చేపట్టారు. ఈనాటి పర్యటనపై ఈసీ తదుపరి చర్యలు తీసుకుంటుందా? లేదా? అనేది వేచి చూడాలి.