Health: రోజూ రెండు లవంగాలు నమిలి తింటే ఏమవుతుంది?

- భారతీయ వంటకాల్లో మసాలాలది ప్రత్యేక స్థానం
- అందులోనూ ఘాటు కోసం లవంగాల వినియోగం
- ఇది కేవలం మసాలానే కాదు ఔషధం కూడా అంటున్న ఆరోగ్య నిపుణులు
భారతీయ వంటకాల్లో మసాలాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. వివిధ రకాల వంటకాల్లో వేర్వేరు మసాలాలు వినియోగిస్తుంటాం. ముఖ్యంగా ఘాటు కోసం లవంగాలను వాడుతుంటాం. అయితే లవంగాలు కేవలం రుచి కోసమే కాకుండా... మన శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు అందిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచేందుకు తోడ్పడతాయని వివరిస్తున్నారు. రోజూ కొన్ని లవంగాలు నమిలి తింటే ఎన్నో ప్రయోజనాలు అందుతాయని చెబుతున్నారు.
జీర్ణ శక్తికి ఎంతో మంచిది...
రోజూ రెండు మూడు లవంగాలను నమిలి తినడం వల్ల శరీరంలో జీర్ణ రసాల ఉత్పత్తి మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయని... ముఖ్యంగా ఎసిడిటీ సమస్యకు చెక్ పడుతుందని వివరిస్తున్నారు. ఆహారం తీసుకున్న తర్వాత రెండు, మూడు లవంగాలు నమిలి తినడం మంచిదని సూచిస్తున్నారు.
రోగ నిరోధక శక్తి బలోపేతం...
లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువని, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయని, జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లతో పోరాటానికి తోడుగా నిలుస్తాయని వివరిస్తున్నారు.
నోటి దుర్వాసనకు, పన్ను నొప్పికి ఉపశమనం...
లవంగాలలో యూజెనాల్ గా పిలిచే సహజ పెయిన్ కిల్లర్ ఉంటుంది. ఇది పంటి నొప్పిని తగ్గిస్తుంది. అదే సమయంలో లవంగాలలోని యాంటీ బ్యాక్టీరియల్ పదార్థాలు నోటిలో బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయి. నోటి దుర్వాసనకు చెక్ పెడతాయని నిపుణులు వివరిస్తున్నారు. అందువల్ల రోజూ రెండు లవంగాలు నమిలి తినడం వల్ల ప్రయోజనం ఉంటుందని పేర్కొంటున్నారు.
రక్తంలో షుగర్ స్థాయుల నియంత్రణ
లవంగాలు శరీరంలో ఇన్సూలిన్ పనితీరును మెరుగుపరుస్తాయని, రక్తంలో షుగర్ స్థాయులను నియంత్రణలో ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు. మధుమేహంతో బాధపడుతున్న వారితో పాటు ప్రీ డయాబెటిస్ వ్యక్తులకు ఇది మేలు చేస్తుందని వివరిస్తున్నారు.
శరీరంలో ఇన్ ఫ్లమేషన్ కు, నొప్పులకు ఉపశమనం
లవంగాల్లో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు చాలా ఎక్కువ. ఇవి నొప్పులకు ఉపశమనం ఇస్తాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, కండరాల నొప్పి, తలనొప్పికి లవంగాలతో మంచి ఉపశమనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ రెండు లవంగాలు నమిలి తింటే చాలు అని వివరిస్తున్నారు.
కాలేయానికి ఆరోగ్యం..
శరీరం నుంచి విష పదార్థాలు, వ్యర్థాలను తొలగించడంలో లవంగాలు సాయపడతాయి. దీనికితోడు లవంగాల్లోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా కలసి... కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
కాంతివంతమైన చర్మం...
లవంగాలలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మంపై మొటిమలను, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ రెండు, మూడు లవంగాలను నమిలితింటే చర్మం సున్నితంగా, కాంతివంతంగా మారుతుందని వివరిస్తున్నారు.
మెరుగైన రక్త ప్రసరణ...
మన శరీరంలో రక్త ప్రసరణ మెరుగై, కణాలకు ఆక్సిజన్ బాగా అందేందుకు లవంగాలు దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల అవయవాల పనితీరు మెరుగుపడుతుందని, శరీరంలో శక్తి స్థాయి పెరుగుతుందని వివరిస్తున్నారు.
మానసిక ఒత్తిడి దూరం...
లవంగాలలోని సహజ సుగంధంతోపాటు కొన్ని రసాయన సమ్మేళనాలు మనలో ఒత్తిడిని, యాంగ్జైటీని తగ్గించేందుకు తోడ్పడతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేగాకుండా మానసికంగా విశ్రాంతి లభిస్తుందని, ఏకాగ్రత పెరుగుతుందని వివరిస్తున్నారు.
ఈ అంశాలు గుర్తుంచుకోండి...
రోజూ రెండు, మూడు లవంగాలు నమిలితినడం వల్ల మనకు మంచి ఆరోగ్యం లభిస్తుందన్నది వాస్తవమే అయినా... అల్సర్లు, జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ముందుగా వైద్యులను సంప్రదించి ఆ తర్వాతే కొత్తగా ఆహారంలో మార్పులు చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.