KCR: తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ మాత్రమే పోరాడగలదు: కేసీఆర్

- తెలంగాణ ప్రజల కష్టనష్టాలు బీఆర్ఎస్‌కు మాత్రమే తెలుసన్న కేసీఆర్
- కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న కేసీఆర్
- ఏప్రిల్ 27న బీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయం
తెలంగాణ ప్రజల కష్టనష్టాలు బీఆర్ఎస్‌కు మాత్రమే తెలుసని, వారి కోసం మన పార్టీ మాత్రమే పోరాడగలదని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ప్రజల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ గురించి, ప్రజల గురించి బీఆర్ఎస్ మాత్రమే ఆలోచించగలదని అన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
దశాబ్దాల పాటు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ, కాంగ్రెస్ పాలనలో తిరోగమనం చెందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాతికేళ్ల స్ఫూర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకోవడానికి పోరాటం చేయాలని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, ప్లీనరీ తదితర అంశాలపై చర్చించారు. పార్టీ ఆవిర్భావం మొదలు ఇప్పటి వరకు సుదీర్ఘ ప్రస్థానంపై కేసీఆర్ వివరించారు. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమం, అధికారంలోకి వచ్చాక తెలంగాణ అభివృద్ధి కోసం చేసిన కృషిని కూడా వివరించారు.
ఏప్రిల్ 27న బీఆర్ఎస్ బహిరంగ సభ
ఏప్రిల్ 27న బీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ రజతోత్సవ వేడుకలను ఏడాది పొడవునా నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ కమిటీలను వేయాలని నిర్ణయించారు. కమిటీల ఇంఛార్జి బాధ్యతలను హరీశ్ రావుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.