Nara Lokesh: ఇకపై నియోజకవర్గ పర్యటనల్లో ముందుగా కార్యకర్తలతో సమావేశం: నారా లోకేశ్ నిర్ణయం

- తిరుపతి పర్యటనలో కార్యకర్తలు, నేతలతో లోకేశ్ సమన్వయ సమావేశం
- ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందజేత
- కార్యకర్తల సమస్యలు తెలుసుకుని, వారికి అండగా నిలబడాలని నేతలకు పిలుపు
తెలుగుదేశం పార్టీ కోటి సభ్యత్వాలతో అతిపెద్ద కుటుంబంగా మారిన సందర్భంలో కార్యకర్తే అధినేత అని స్పష్టం చేసిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్... తాను అన్న మాటలను ఆచరణలో పెట్టారు. కార్యకర్తే అధినేత అన్న మాటను శిరసావహిస్తూ... తన తిరుపతి నియోజకవర్గ పర్యటనలో ముందుగా పార్టీ కార్యకర్తలు, నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇకపై ఏ నియోజకవర్గ పర్యటనకు వెళ్లినా మొదట కార్యకర్తలతో భేటీ కావాలని మంత్రి నారా లోకేశ్ నిర్ణయించుకున్నారు. బాబు ష్యూరిటీ- భవిష్యత్ కు గ్యారెంటీ, పార్టీ సభ్యత్వం, ఓటర్ వెరిఫికేషన్, మన టీడీపీ యాప్ లో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలు, నాయకులతో ఎక్కువ సమయం కేటాయించనున్నారు.
అందులో భాగంగానే నేడు తిరుపతిలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేశ్... ముందుగా టీడీపీ కార్యాలయంలో క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జ్ లతో పాటు బాబు ష్యూరిటీ-భవిష్యత్ కు గ్యారెంటీ, మన టీడీపీ యాప్, సభ్యత్వ నమోదులో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలను పరిష్కరించి అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు.
పనిచేసే వారిని ప్రోత్సహిస్తా
పార్టీని బలోపేతం చేసేందుకు నేను సగం రోజు మీతో గడుపుతున్నాను. పార్టీ, ప్రభుత్వం రెండూ అనుసంధానమై ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. పార్టీలో నూతనంగా క్లస్టర్, యూనిట్, బూత్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో నేను పాదయాత్ర చేసినప్పుడు.. అన్నా నేను కష్టపడ్డాను.. నన్ను గుర్తించడం లేదని చాలా మంది నాతో చెప్పారు. సీనియర్లు, జూనియర్లను సమానంగా గౌరవిస్తా, పనిచేసే వారిని ప్రోత్సహిస్తా. పార్టీ లేకపోతే మనం ఎవరూ లేము అని గుర్తుంచుకోవాలి. ఇవాళ మనకు సమాజంలో గౌరవం లభిస్తోందంటే అందుకు కారణ తెలుగు దేశం పార్టీనే.
కార్యకర్తల సమస్యలు తెలుసుకుని, వారికి అండగా నిలబడాలి
ఎన్నికల్లో గెలిచాం, తిరుగులేదనే ధోరణి సరికాదు. నిత్యం ప్రజల్లో ఉండాలి. మంగళగిరిలో నేను 91వేల మెజార్టీతో గెలిచా. నాకు ఎంత పని ఒత్తిడి ఉన్నా మంగళగిరి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నా. బాధ్యత పెరిగింది. కార్యకర్తల సమస్యలు తెలుసుకుని, వారికి అండగా నిలబడాలి. అలకలు మానుకుని నాయకులు సమిష్టిగా పనిచేయాలి. గత ఐదేళ్లలో మనం అనేక కష్టాలు ఎదుర్కొన్నాం. అక్రమ కేసులు పెట్టారు, లాఠీఛార్జి చేశారు. అవన్నీ మర్చిపోకూడదు.
వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి
పార్టీ ఏ కార్యక్రమం పిలుపునిచ్చినా కలిసికట్టుగా పనిచేయాలి. ప్రజల్లోకి తీసుకెళ్లాలి. గ్రూప్ రాజకీయాలకు దూరంగా ఉండాలి. వైసీపీ నేతలు రెడ్ బుక్ గురించి మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులు ప్రజలను, మనల్ని ఇబ్బంది పెట్టారు. తప్పుచేసిన వారిని పద్ధతి ప్రకారం చట్టపరిధిలో శిక్షిస్తాం. వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి
కార్పొరేటర్ల తో సమావేశమైన నారా లోకేశ్
కార్యకర్తలతో సమావేశం అనంతరం మంత్రి నారా లోకేశ్ తిరుపతి నగర కార్పొరేటర్లతో సమావేశం అయ్యారు. వార్డుల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.