Pakistan: పాకిస్థాన్‌లో బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురిని కిందకు దింపి కాల్చి చంపిన దుండగులు

Gunmen Open Fire On Lahore Bound Bus 7 Passengers Killed

  • లాహోర్ వెళుతున్న బస్సును ఆపిన గుర్తు తెలియని దుండగులు
  • ప్రయాణికులను కిందకు దింపి కాల్పులు జరిపిన దుండగులు
  • మృతులంతా సెంట్రల్ పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన వారన్న అధికారులు

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. లాహోర్‌కు వెళుతున్న బస్సుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపడంతో ఏడుగురు ప్రయాణికులు మృతి చెందారు. బలూచిస్థాన్‌లోని బర్ఖాన్‌లో ఈ దుర్ఘటన సంభవించిందని అధికారులు తెలిపారు.

అంతర్జాతీయ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం, గుర్తు తెలియని వ్యక్తులు లాహోర్ మార్గంలో వెళుతున్న బస్సులను, ఇతర వాహనాలను అడ్డగించారు. 45 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సును కూడా వారు ఆపారు. అనంతరం, బస్సు టైర్లలోని గాలిని తీసివేశారు. బస్సులోకి ప్రవేశించి ప్రయాణికులందరినీ గుర్తింపు కార్డులు చూపించమని అడిగారు. ఆ తర్వాత ఏడుగురు ప్రయాణికులను బస్సులో నుంచి బలవంతంగా కిందకు దించి, తుపాకీతో కాల్చి చంపారు. మృతులంతా సెంట్రల్ పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన వారని అధికారులు వెల్లడించారు.

పంజాబ్‌లోని డేరా ఘాజాఖాన్‍‌ను బర్ఖాన్‌కు కలిపే మార్గంలో ఈ ఘటన జరిగిందని అసిస్టెంట్ కమిషనర్ ఖాదీమ్ హుస్సేన్ రాయిటర్స్‌కు తెలిపారు. హత్యల వెనుక గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఈ ఘటనకు ఏ సంస్థ కూడా బాధ్యత వహించలేదని ఆయన పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, గతవారం బొగ్గు గని కార్మికులు ప్రయాణిస్తున్న వాహనంపై జరిగిన బాంబు దాడిలో 11 మంది మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు.

  • Loading...

More Telugu News