Unni Mukundan: రక్తంతో తడుస్తున్న కథలు .. ఎరుపెక్కిన వినోదం!

- కథ ఏదైనా హింస కామన్
- రాక్షసత్వమే నేటి వినోదం
- అనుభూతిని ఆశిస్తే అమాయకత్వమే
- విలన్ కి మించిన హింసకు హీరో పాల్పడం ఇప్పటి ట్రెండ్
ఆధునిక జీవితంలో మనిషికి వినోదాన్ని అందించడానికి ఎన్నో సాధనాలు వచ్చాయి. అయితే ప్రధానమైన వినోదసాధనంగా సినిమా మాత్రమే అగ్రస్థానంలో తన వైభవాన్ని చాటుకుంటోంది. కథాకథనాల పరంగా సినిమా కొత్తపుంతలు తొక్కుతూ పరుగులు తీస్తోంది. అయితే సాంకేతిక పరంగా శిఖరస్థాయికి వెళుతున్న మన సినిమా, అదే సమయంలో వినోదానికి దూరమవుతూ ఉండటం ఇక్కడ మనం గమనించవలసిన విషయం. 'చేసినవారికి చేసినంత హింస' అనే సూత్రాన్నే నేటి సినిమాలు ఫాలో అవుతున్నాయనిపిస్తోంది.
కుటుంబం .. బంధాలు .. అనుబంధాలు .. ప్రేమ .. పెళ్లి .. గొడవలు .. ఇలాంటి అంశాల చుట్టూ కథలు తిరుగుతూ ఉండేవి. అడపాదడపా మాత్రమే క్రైమ్ థ్రిల్లర్ లు .. దెయ్యాల సినిమాలు పలకరించేవి. తెరపై హీరో - విలన్ గ్యాంగ్ గొడవపడినా, అవి వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేవి. కానీ ఈ మధ్య కాలంలో హింస పెరిగిపోతోంది. యాక్షన్ .. క్రైమ్ .. దెయ్యం నేపథ్యంలో సాగే సినిమాలలో రక్తపాతం ఒక రేంజ్ లో కనిపిస్తోంది. ఒక్కోసారి జుగుప్స కూడా కలుగుతోంది.
ఆకర్షణీయమైన ఆయుధాలు డిజైన్ చేయించి మరీ హింసను చూపుతున్నారు. తలలు .. కాళ్లు .. చేతులు గాల్లోకి ఎగిరిపడుతున్నాయి. కోత మెషిన్ పెట్టి మరీ తలలు తరగడం .. మెడలు కోసి తలలు విసిరేయడం కామన్ అయిపోయింది. విలన్ కి మించిన హింసకు హీరో తెగబడటం ఇక్కడ విచిత్రం. పగ .. ప్రతీకారం .. హత్యలు చుట్టూ తిరిగే ఈ కథలు వెన్నెల పాటలను .. విరహగీతాలను మరిచిపోయి చాలా కాలమే అయిపోయింది. ఇప్పుడు వెబ్ సిరీస్ లు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. ఆరోగ్యకరమైన వినోదానికి దూరంగా బ్రతకడం .. అనుభూతిని వదులుకోవడమే నేటి ట్రెండ్ అనుకోవాలేమో.