qatar king: ఖతర్ గోల్డెన్ ప్యాలెస్ వైభవం చూడతరమా...!

- రాజ ప్రసాదంలో విశాలమైన 15 గదులు
- విలాసవంతమైన నౌక.. 14 విమానాలు
- 500 కార్లు పట్టేంత పార్కింగ్ స్థలం
మెడలో ఓ బంగారు గొలుసు... చేతికి ఓ ఉంగరం ఉంటేనే ఎంతో దర్జాగా ఫీలవుతాం. మరి... ఉంటున్న ఇల్లే స్వర్ణమయమైతే? కప్ బోర్డులు, షాండ్లియర్లు తదితర ఇంటీరియర్ అంతా బంగారు తాపడంతో కూడుకున్నదైతే? ఆ నివాసం ఏ స్థాయిలో మెరిసిపోతుందో ఊహించండి. ఇదంతా ఖతర్ పాలకుడు తమీమ్ బిన్ హమద్ అల్‌థానీ గురించే. ఖతర్ రాజు అయిన తమీమ్ బిన్ రెండు రోజుల పర్యటన కోసం సోమవారం భారత్‌కు విచ్చేశారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఆయన ఆస్తిపాస్తుల గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది.
ఖతర్ పాలకులు అల్‌థానీ వంశం ఆస్తుల విలువ 335 బిలియన్ డాలర్లు. షేక్ తమీమ్ వద్దే 2 బిలియన్ డాలర్ల ఆస్తిపాస్తులున్నాయి. దోహా రాయల్ ప్యాలెస్‌లో తమీమ్ ఫ్యామిలీ ఉంటోంది. ఈ ప్యాలెస్ ఇంటీరియర్‌లో ప్రతీది పసిడి తాపడంతో కూడినదే. అందుకే ఈ ప్యాలెస్‌ను గోల్డెన్ ప్యాలెస్ అంటారు. ఈ రాజ ప్రసాదంలో 15 విశాలమైన గదులున్నాయి. ప్రాంగణంలో 500 కార్లను నిలిపేంత విశాలమైన పార్కింగ్ స్థలం ఉంది. తమీమ్ కుటుంబానికి లండన్‌లో 17 పడక గదులతో కూడిన భారీ భవనం, ప్యారిస్, న్యూయార్క్‌లలో మ్యాన్షన్లు ఉన్నాయి.
రాజ కుటుంబం ప్రయాణాల కోసం ప్రత్యేకంగా 400 మిలియన్ డాలర్ల విలువైన విలాసవంతమైన నౌక, ఏకంగా 14 విమానాలు ఉన్నాయి. లగ్జరీ కార్లకు అయితే లెక్కే లేదు. వీటన్నింటిలోనూ తమీమ్ బిన్ కుటుంబసభ్యలు, సన్నిహితులు, ఉన్నత అధికార వర్గాలు మాత్రమే ప్రయాణిస్తుంటారు. అన్నట్టు.. ఖతర్ ఏర్పడ్డప్పటి నుంచి తమీమ్ బిన్ హమద్ అల్‌థానీ కుటుంబమే ఆ దేశాన్ని పాలిస్తోంది. 2013 నుంచి ఖతర్‌ను తమీమ్ బిన్ ఏలుతున్నారు. భారత పర్యటనకు వచ్చిన తమీమ్‌కు ప్రధాని మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి మరీ స్వాగతం పలికారు.