KCR: పాస్ పోర్ట్ ఆఫీసులో కేసీఆర్

Former CM KCR Changed His Diplomatic Passport

  • డిప్లొమాటిక్ పాస్ పోర్టు మార్చుకున్న మాజీ సీఎం
  • సాధారణ పాస్ పోర్టు రెన్యూవల్ చేయించుకున్నట్టు సమాచారం
  • వచ్చే నెలలో అమెరికాలోని మనవడి దగ్గరికి కేసీఆర్ పయనం

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం ఉదయం పాస్ పోర్ట్ ఆఫీసుకు వెళ్లారు. తన డిప్లొమాటిక్ పాస్ పోర్టును అధికారులకు అందజేసి సాధారణ పాస్ పోర్ట్ ను రెన్యూవల్ చేయించుకున్నారు. ఆయన మనవడు, మాజీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నారు. వచ్చే నెలలో కేసీఆర్ అమెరికా వెళ్లి మనవడి దగ్గర కొన్నాళ్లు గడుపుతారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన పాస్ పోర్ట్ మార్చుకున్నారని సమాచారం. ఉదయం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ చేరుకున్న కేసీఆర్... సికింద్రాబాద్ లోని పాస్ పోర్ట్ ఆఫీసుకు వెళ్లారు.

పాస్ పోర్ట్ రెన్యూవల్ తర్వాత అక్కడి నుంచి నందినగర్ లోని తన నివాసానికి చేరుకున్నారు. స్వల్ప విశ్రాంతి తర్వాత తెలంగాణ భవన్ కు చేరుకున్నారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. దాదాపు 7 నెలల విరామం తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్ కు రావడం విశేషం. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు, పార్టీ భవిష్యత్ కార్యక్రమాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్ నేతలతో సమావేశం సందర్భంగా ప్లీనరీ నిర్వహణ, పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలపై కీలక నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

More Telugu News