Manisharma: చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేసిన ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ

- చిరు మానస పుత్రిక చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఫ్యాన్స్, సినీ సెలబ్రీటీల రక్తదానం
- తాజాగా రక్తదానం చేసి చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్న మణిశర్మ
- ఇలా రక్తదానం చేయడం తన వంతు కర్తవ్యంగా భావిస్తున్నానన్న సంగీత దర్శకుడు
తెలుగు చిత్రపరిశ్రమలో ఎవరెస్ట్ శిఖరం మెగాస్టార్ చిరంజీవి. ఇలా వెండితెర రారాజుగా వెలుగొందుతున్న ఆయన చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ను స్థాపించి తన అభిమానుల సహకారంతో ఎనలేని సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. చిరంజీవి మానస పుత్రిక అయిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఎందరో రక్తదానం చేస్తుంటారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ రక్తదానం చేసి చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇలా మణిశర్మ రక్తదానం చేయటం ఇది రెండోసారి.
‘రక్తదానం’తో ఆపదలో ఉన్నవారి ప్రాణాలు నిలపాలన్న చిరంజీవి ఆశయాన్ని తమ సంకల్పంగా భావించి రక్తదానం చేసిన అభిమానులెందరో. వారిలో తన స్వరాలతో ప్రేక్షకుల్ని మైమరపించే స్వరబ్రహ్మ మణిశర్మ ఒకరు. చిరంజీవి పిలుపును కర్తవ్యంగా భావించి నేడు ఈ మహత్కార్యంలో భాగమై రక్తదానం చేసిన మణిశర్మ మరెందరికో స్ఫూర్తిగా నిలిచారు. పాటలకు స్వరాలు కూర్చడమే కాదు... మానవత్వానికి చిరునామాగా నిలవడమూ తెలుసని నిరూపించారాయన.
ఈ సందర్భంగా మణిశర్మ మాట్లాడుతూ... ‘‘ఎప్పటి నుంచో రక్త దానం చేయాలని అనుకుంటున్నాను. చిరంజీవిగారి సినిమాలకు సంగీతం అందించటం ద్వారా ఆయనపై అభిమానాన్ని చాటుకున్నాను. ఇప్పుడు రక్తదానం చేయటం అనేది సంతోషంగా ఉంది. నా వంతు కర్తవ్యంగా భావిస్తున్నాను. లక్షలాది మంది ఇందులో భాగమయ్యారు. అందులో నేను ఒక బొట్టులాగా ఇప్పుడు చేరాను. ఇలాంటి మంచి కార్యక్రమంలో అందరూ భాగం కావాలి’’ అని సంగీత దర్శకుడు చెప్పుకొచ్చారు.