SS Rajamouli: రాజమౌళి-రష్మీ సరదా లవ్ ట్రాక్... వైరల్ అవుతున్న పాత వీడియో!

- జక్కన్న, రష్మీ అతిథి పాత్రల్లో కనిపించిన సీరియల్ 'యువ'
- అందులో రాజమౌళి-రష్మీ మధ్య ఒక సరదా లవ్ ట్రాక్
- దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి భారీ చిత్రాలతో భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై నిలిపారు. జక్కన్న తెరకెక్కించిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది ఇండియన్ ఫిల్మ్ సత్తా చాటాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో భారీ ప్రాజెక్టుతో రాజమౌళి బీజీగా ఉన్నారు.
ఇక జక్కన్న దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా ప్రేక్షకులకు సుపరిచితమే. ఇటీవల వచ్చిన 'కల్కి 2898 ఏడీ', 'మజ్ను', 'బాహుబలి', 'సై' తదితర చిత్రాల్లో ఆయన అతిథి పాత్రల్లో మెరిశారు. అలాగే గతంలో రాజమౌళి ఓ టీవీ సీరియల్‌లోనూ నటించారు. దానికి సంబంధించిన పాత వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ సీరియల్ లో యాంకర్ రష్మీ గౌతమ్ తో ఆయనకు ఓ సరదా లవ్ ట్రాక్ ఉంది.
యాంకర్ గా మంచి గుర్తింపు పొందిన రష్మీ కెరీర్ ఆరంభంలో కొన్ని సీరియల్స్ లోనూ నటించారు. అలా ఆమె నటించిన యూత్‌ఫుల్ కంటెంట్ తో వచ్చిన ధారావాహిక 'యువ'. ఈ సీరియల్ లో జక్కన్న అతిథి పాత్రలో కనిపించారు.
ఇందులో రాజమౌళి-రష్మీపై ఒక సరదా లవ్ ట్రాక్ ఉంటుంది. అందులో భాగంగా ఆమె 'ఐ లవ్ యూ' అంటూ జక్కన్నకు లవ్ ప్రపోజ్ చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
కాగా, కెరీర్ తొలినాళ్లలో జక్కన్న 'శాంతి నివాసం' అనే డైలీ సీరియల్ కు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత 'స్టూడెంట్ నెం.1' తో డైరెక్టర్ గా వెండితెరకు పరిచయమయ్యారు.