Etala Rajender: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో అధికారులకు ఈటల వార్నింగ్

BJP MP Etala Rajender Strong Warning To IAS And IPS Officers

  • నిబంధనలకు లోబడి పనిచేయాలంటూ సివిల్ సర్వెంట్లకు హితవు
  • ప్రభుత్వంలోని పెద్దలు ఆదేశించారని రూల్స్ అతిక్రమించొద్దని సూచన
  • ఆరెంజ్ బుక్ మెయింటెయిన్ చేస్తున్నామని హెచ్చరిక

ఐఏఎస్ లు, ఐపీఎస్ లు పబ్లిక్ సర్వెంట్లు.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హితవు పలికారు. ప్రభుత్వంలోని పెద్దలు చెప్పారని నిబంధనలకు విరుద్ధంగా నడుచుకుంటే మాజీ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. తాము కూడా ఆరెంజ్ బుక్ మెయింటెయిన్ చేస్తున్నామని ఈటల చెప్పారు. రూల్స్ కు విరుద్ధంగా, ప్రతిపక్ష నేతలను వేధింపులకు గురిచేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న అధికారుల పేర్లను అందులో రాసుకుంటున్నామని తెలిపారు.

సమయం వచ్చినపుడు లెక్కలతో బయటపెట్టి ఫలితం అనుభవించేలా చేస్తామని ఈటల పేర్కొన్నారు. ఈమేరకు బుధవారం వరంగల్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు. బాస్‌ల ఆదేశాల ప్రకారం కాకుండా, చట్టప్రకారం నడుచుకోవాలని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఈటల సూచించారు.

చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని, పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగినట్లుగా పనిచేస్తే ఎట్టి పరిస్థితుల్లోను ఊరుకోబోమని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రచారానికి వెళ్తే ప్రజలు బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బీఆర్ఎస్ భ్రష్టు పట్టించిందని, ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే పద్ధతిలో ముందుకు సాగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ కు కూడా బీఆర్ఎస్ కు పట్టిన గతే పడుతుందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News