betting: రోజుకు రూ.2.5 లక్షల వడ్డీ.. ఆన్‌లైన్ జూదానికి ముగ్గురి బలి

- ఆన్‌లైన్ జూదం తెచ్చిన చిక్కులు
- ఒకరి పేరు చెప్పి అప్పు చేసిన మరొకరు
- రూ.80 లక్షల అప్పు మిగిలిందని ఆవేదన
వడ్డీ ఎంతైనా లెక్కే చేయకుండా.. ఇబ్బడిముబ్బడిగా అప్పులు తెచ్చి మరీ ఆన్‌లైన్ జూదంలో పెట్టినప్పుడు ఆ మజాలో వారికి తెలియలేదు తామెంత ప్రమాదంలో పడబోతున్నామనే సంగతి! ఆ డబ్బులన్నీ పోయి, లక్షల్లో అప్పులు మిగలడం... అవి తీర్చే మార్గం కనిపించకపోవడంతో తాము ఇక బయటకు రాలేనంత లోతైన ఊబిలో చిక్కుకుపోయామనేది తెలిసింది. దిక్కుతోచని ఆ స్థితిలో బలవన్మరణమే శరణ్యం అనుకున్నారు. ఒకరి పేరు మీద మరొకరు అప్పుల మీద అప్పులు చేసి.. ఆ డబ్బునంతా ఆన్‌లైన్ బెట్టింగ్ లో పెట్టి, ఉన్నదంతా కోల్పోయిన ఆ ముగ్గురు అవి తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కర్ణాటకలోని మైసూరు సమీపంలో ఈ ఘటన జరిగింది. హాంచా గ్రామనికి చెందిన జోశి ఆంథోనీ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన పేరు, తన సోదరి పేరు చెప్పి.. సోదరుడు జోబి ఆంథోనీ, మరదలు షర్మిల ఇష్టం వచ్చినట్లుగా అప్పులు చేశారని.. రూ.80 లక్షల దాకా అప్పులు పేరుకుపోయాయని.. దీనికి రోజుకు రూ.2.5 లక్షల వడ్డీ కట్టాల్సి వస్తోందని అంతకుముందు సెల్ఫీ వీడియోలో ఆయన వాపోయాడు. ఈ వీడియో బయటికి రావడంతో జోబి ఆంథోనీ, ఆయన భార్య షర్మిల విజయనగరంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై మైసూరు, విజయనగరంలో కేసులు నమోదయ్యాయి.