Delhi CM: నేటి సాయంత్రం ఢిల్లీ ముఖ్యమంత్రి పేరు ప్రకటన.. రేపు ప్రమాణస్వీకారం

- రేపు ఉదయం 11 గంటలకు ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారం
- శాసనసభాపక్ష నేతను ఎన్నుకోవడానికి సమావేశం కానున్న బీజేపీ ఎమ్మెల్యేలు
- ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకానున్న 20 రాష్ట్రాల సీఎంలు
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి రాంలీలా మైదానంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. నూతన ముఖ్యమంత్రి ఎంపిక కోసం ఈ సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఈ భేటీలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా పర్వేశ్ వర్మ, శిఖా రాయ్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఆశిష్ సూద్, రేఖా గుప్తా, విజేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ్, జితేంద్ర మహాజన్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. మంత్రి పదవుల కోసం ఇప్పటికే దాదాపు 15 మంది పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేసినట్టు సమాచారం.
ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు పంపారు. 50 మంది సినీ తారలు, పారిశ్రామికవేత్తలు, దౌత్యవేత్తలకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. వీరితో పాటు బాబా రాందేవ్, స్వామి చిదానంద, బాబా బాగేశ్వర్ ధీరేంద్ర శాస్త్రితో పాటు పలువురు మత ప్రముఖులు హాజరుకానున్నారు.