PVR INOX: ప్రకటనలతో తన టైం వృథా చేశారంటూ ఐనాక్స్ పై బెంగళూరు లాయర్ దావా

Bengaluru Man Sues PVR INOX For Wasting His Time With 25 Minute Ads

  • రూ.65 వేల పరిహారం చెల్లించాలంటూ వినియోగదారుల కోర్టు ఆదేశం
  • 25 నిమిషాల పాటు యాడ్స్ వేయడంపై మందలించిన కోర్టు
  • ప్రభుత్వ సూచనల ప్రకారమే ప్రదర్శించామన్న థియేటర్ యాజమాన్యం

అరగంట పాటు యాడ్స్ వేసి తన సమయం వృథా చేశారంటూ పీవీఆర్ ఐనాక్స్ యాజమాన్యంపై బెంగళూరు లాయర్ ఒకరు కోర్టుకెక్కారు. ప్రకటనల కారణంగా షెడ్యూల్ టైం కన్నా థియేటర్ లో ఎక్కువసేపు కూర్చోవాల్సి వచ్చిందని, దీనివల్ల ముఖ్యమైన సమావేశానికి హాజరుకాలేకపోయానని వాపోయాడు. దీనికి నష్టపరిహారం కోరుతూ వినియోగదారుల న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కేసు విచారించిన న్యాయస్థానం.. ఇతరుల సమయం, డబ్బుతో ప్రయోజనం పొందే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్యానిస్తూ రూ.65 వేలు పరిహారంగా చెల్లించాలని ఐనాక్స్ యాజమాన్యాన్ని ఆదేశించింది. 

అదేవిధంగా రూ. లక్ష జరిమానా విధించింది. నెల రోజుల్లోగా ఈ మొత్తాన్ని వినియోగదారుల సంక్షేమ బోర్డుకు చెల్లించాలని ఆదేశించింది. బెంగళూరుకు చెందిన అభిషేక్ అనే లాయర్ 2023లో పీవీఆర్ ఐనాక్స్ లో సినిమాకు వెళ్లాడు. బుక్ మై షోలో సాయంత్రం 4.05 గంటల షోకు ‘శామ్ బహదూర్’ అనే సినిమాకు 3 టికెట్లు బుక్ చేసుకున్నాడు. అయితే, 4.05 గంటలకు సినిమా మొదలుకావాల్సి ఉండగా ప్రకటనల కారణంగా 4:30 గంటలకు ప్రారంభమైంది. దీంతో సినిమా పూర్తయ్యేసరికి 6:30 గంటలు అయింది.

ఆరు గంటలకు పూర్తవ్వాల్సిన సినిమా అరగంట ఆలస్యం కావడంతో తాను ముఖ్యమైన అపాయింట్ మెంట్ రద్దు చేసుకోవాల్సి వచ్చిందని అభిషేక్ వినియోగదారుల కోర్టుకెక్కారు. అనవసరమైన యాడ్స్ తో ప్రేక్షకుల సమయాన్ని వృథా చేస్తున్నారంటూ ఐనాక్స్ యాజమాన్యంపై మండిపడ్డారు. కేసు విచారణ సందర్భంగా ఐనాక్స్ తరఫున లాయర్ వాదన వినిపిస్తూ.. ప్రభుత్వ సూచనలు, ఆదేశాల ప్రకారమే యాడ్స్ ప్రసారం చేశామని వివరణ ఇచ్చారు. అయితే, సినిమా ప్రారంభానికి ముందు పది నిమిషాలు, ఇంటర్వెల్ సమయంలో యాడ్స్ ప్రసారం చేయాలని ఐనాక్స్ కు కోర్టు సూచించింది.

  • Loading...

More Telugu News