Eknath Shinde: మహారాష్ట్ర అధికార కూటమిలో లుకలుకలు!

- సచివాలయంలో మెడికల్ సెల్‌ను ఏర్పాటు చేసిన షిండే
- సీఎంఆర్ఎఫ్ ఉన్నప్పటికీ ప్రత్యేకంగా దీనిని ఏర్పాటు చేయడంపై విమర్శలు
- 20 మంది ఎమ్మెల్యేలకు ‘వై’ సెక్యూరిటీ తొలగింపు
- వివాదానికి ఆజ్యం పోసిన నిర్ణయాలు
- తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్న ఫడ్నవీస్, షిండే
మహారాష్ట్రలోని అధికార కూటమి ‘మహాయుతి’లో లుకలుకలు మొదలయ్యాయన్న వార్తలపై ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్పందించారు. తమ మధ్య ఎలాంటి కోల్డ్ వార్ లేదని, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఎటువంటి తగాదాలు లేవని స్పష్టం చేశారు. అభివృద్ధిని వ్యతిరేకించే వారిపై సమష్టిగా పోరాడతామని చెప్పారు. దేవేంద్ర ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో ఓ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, ఇప్పుడు అలాంటి దాన్నే తమ ప్రాంత ప్రజల కోసం పునరుద్ధరించామని సచివాలయంలో ఏర్పాటు చేసిన ఓ మెడికల్ సెల్ గురించి ఏక్‌నాథ్ షిండే తెలిపారు.
విభేదాల వార్తలపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా మాట్లాడారు. సచివాలయంలో మెడికల్ సెల్‌ను షిండే ఏర్పాటు చేయడంలో తప్పేమీ లేదన్నారు. తాను డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు కూడా అలాంటి దానినే ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
కాగా, ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఓ వైద్య సహాయ కేంద్రాన్ని షిండే ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. అలాగే, అంతకుముందు 20 మంది ఎమ్మెల్యేలకు ‘వై’ సెక్యూరిటీ తొలగించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. వీరిలో బీజేపీ, ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ శివసేనకు చెందిన వారే ఎక్కువగా ఉండటం గమనార్హం. దీంతో మహాయుతి కూటమిలో ఏదో జరుగుతోందన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం, డిప్యూటీ సీఎం ఇలా స్పందించారు.