Keerthi Teja: తాతయ్య నన్ను సొంత మనిషిలా చూడలేదు, అందుకే చంపేశా: పారిశ్రామికవేత్త జనార్దనరావు మనవడు కీర్తితేజ

- ప్రముఖ పారిశ్రామికవేత్త జనార్ధనరావును హత్య చేసిన మనవడు
- తాతయ్య తనను నిత్యం అవమానించేవాడన్న కీర్తితేజ
- ఆస్తిలో వాటా అడిగితే ఇవ్వనని చెప్పడంతో కత్తితో పొడిచినట్లు వెల్లడి
ప్రముఖ పారిశ్రామికవేత్త, వెల్జాన్ గ్రూపు సంస్థల అధినేత వెలమాటి చంద్రశేఖర జనార్దనరావు (86)ను ఆయన మనవడు కీర్తితేజ హత్య చేసిన విషయం తెలిసిందే. తన తాతయ్య తనను ఎప్పుడూ సొంత మనిషిలా చూడలేదని, కుటుంబ సభ్యుడిగానూ గుర్తించలేదని కీర్తితేజ పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. ఈ కేసులో నిందితుడైన కీర్తితేజను పోలీసులు ఐదు రోజుల కస్టడీకి తీసుకుని విచారించారు. రిమాండులో తొలుత పోలీసుల విచారణకు సహకరించని కీర్తితేజ, ఆ తర్వాత హత్యకు దారితీసిన పరిస్థితులను వివరించాడు.
పోలీసుల కస్టడీలో కీర్తితేజ ఆసక్తికర విషయాలు వెల్లడించినట్లు సమాచారం. తన తాత జనార్ధనరావు నిత్యం తనను అవమానించేవాడని, అందరికంటే హీనంగా చూసేవాడని కీర్తితేజ చెప్పినట్లుగా సమాచారం. ప్రతిరోజూ 'బెగ్గర్' అని పిలిచేవాడని, కార్యాలయంలోనూ అవమానించేవాడని తెలిపాడు. ఆస్తి పంపకాలు, పదవుల కేటాయింపులోనూ తనకు ప్రాధాన్యం ఇవ్వలేదని, చివరికి డైరెక్టర్ పదవి కూడా ఇవ్వలేదని పేర్కొన్నాడు.
ఈ కారణాల వల్లనే తన తాతతో విభేదాలు పెరిగాయని, అందుకే ఆయనను చంపాలని నిర్ణయించుకున్నానని కీర్తితేజ పోలీసుల కస్టడీలో చెప్పినట్లగా సమాచారం. తాను ఇన్‌స్టామార్ట్ నుండి కత్తిని కొనుగోలు చేశానని చెప్పాడు. ఒకరోజు ఆస్తిలో వాటా అడిగినప్పుడు ఇవ్వనని చెప్పడంతో కత్తితో పొడిచానని తెలిపాడు. అనంతరం, కత్తి, రక్తంతో కూడిన దుస్తులను బీఎస్ మక్తాలోని ఎల్లమ్మగూడ పక్కన ఖాళీ స్థలంలో తగులబెట్టినట్లు చెప్పాడని సమాచారం.