Jagan: జగన్ ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందే.... ఏపీ పోలీసు అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం

- ఇవాళ విజయవాడ జైల్లో వల్లభనేని వంశీని పరామర్శించిన జగన్
- మీడియాతో మాట్లాడుతూ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు
- రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని వెల్లడి
- పోలీసులు రిటైర్ అయినా సరే... తీసుకొచ్చి బట్టలూడదీసి నిలబెడతామని వ్యాఖ్యలు
- జగన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఏపీ పోలీసు అధికారుల సంఘం ప్రెస్ మీట్
ఇవాళ విజయవాడ జైల్లో వల్లభనేని వంశీని పరామర్శించిన తర్వాత వైసీపీ అధినేత జగన్ మీడియాతో మాట్లాడుతూ పోలీసులపైనా నిప్పులు చెరిగారు. మళ్లీ వచ్చేది తమ ప్రభుత్వమేనని, పోలీసులు రిటైర్ అయినా సరే తీసుకువచ్చి బట్టలూడదీసి నిలబెడతామని జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ వ్యాఖ్యలపై ఏపీ పోలీసు అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని జగన్ వ్యాఖ్యానించడం సరికాదని పోలీసు సంఘం నేతలు ఖండించారు. ఇప్పుడు రాష్ట్రంలో పనిచేస్తున్న పోలీసులు 8 నెలల కిందట గత ప్రభుత్వ హయాంలోనూ పనిచేసినవాళ్లేనన్న విషయాన్ని జగన్ గుర్తించాలని హితవు పలికారు.
పోలీసు అధికారులు రిటైర్ అయిన తర్వాత కూడా వారిని తీసుకువచ్చి బట్టలూడదీసి నిలబెడతాననడం సమంజసమా అని ప్రశ్నించారు. జగన్ వ్యాఖ్యలు పోలీసుల మనోభావాలు దెబ్బతినేలా, బెదిరిస్తున్నట్టుగా ఉన్నాయని అన్నారు.
ఏపీ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు మాట్లాడుతూ, జగన్ బెదిరింపులు మానుకోవాలని హితవు పలికారు. జగన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే గౌరవంగా ఉంటుందని అన్నారు. చట్టం, ధర్మం, న్యాయం, సత్యం అనే నాలుగు సింహాలకే సెల్యూట్ చేస్తారని... చట్టాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయరని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారన్న విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు.
జగన్ బెదిరింపు వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనకు చట్టాలపై, ప్రజాస్వామ్యంపై ఏమాత్రం గౌరవం లేదన్న విషయం అర్థమవుతోందని శ్రీనివాసరావు విమర్శించారు. ఐదేళ్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇవాళ ఈ విధంగా మాట్లాడడం దురదృష్టకరమని అభివర్ణించారు.
ఇలాంటి వ్యాఖ్యలతో ప్రజాస్వామ్యానికి ఏం సంకేతాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. మీరే ఇలా మాట్లాడితే మీ కింద ఉండే వారు ఇంకెలా మాట్లాడతారని నిలదీశారు. జగన్ ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందేనని పోలీసు అధికారుల సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నామని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.