Pawan Kalyan: సనాతన ధర్మంపై కామెంట్లు చేయడం ఈజీనే... కానీ...!: పవన్ కల్యాణ్

- మహా కుంభ్ ను మృత్యు కుంభ్ అని పేర్కొన్న మమతా బెనర్జీ
- హిందూ మతంపై చాలా సులభంగా కామెంట్లు చేస్తుంటారన్న పవన్
- ఇతర మతాలపై ఇలా వ్యాఖ్యలు చేయరని వెల్లడి
- దుర్ఘటనలు జరగాలని ఎవరూ కోరుకోరు కదా అని స్పష్టీకరణ
- యోగి సర్కారు కుంభమేళాను అద్భుతంగా నిర్వహిస్తోందని కితాబు
యూపీలోని ప్రయాగరాజ్ లో కుంభమేళాలో పాల్గొన్న సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను జాతీయ మీడియా పలకరించింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మహా కుంభ్ ను మృత్యు కుంభ్ గా అభివర్ణించడం పట్ల పవన్ స్పందించారు. ఈ వ్యాఖ్యలు చాలా తప్పు అని ఖండించారు.
"సనాతన ధర్మంపై, హిందూ ధర్మంపై చాలా సులభంగా వ్యాఖ్యలు చేస్తుంటారు... అదే మన నాయకులతో వచ్చిన సమస్య. వారు హిందూ మతంపై చేసినంత సులభంగా ఇతర మతాలపై వ్యాఖ్యలు చేయరు. ఇలాంటి ధోరణి ఉన్న నాయకులతో కష్టమే. తమ వ్యాఖ్యలతో కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నామని వాళ్లు తెలుసుకోరు.
కుంభమేళాలో కొన్ని ఘటనలు జరిగాయంటే అది నిర్వహణా వైఫల్యం అనలేం. కోట్లాది మంది తరలివచ్చే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం ఏ ప్రభుత్వానికైనా అత్యంత క్లిష్టమైన సవాల్ గా నిలుస్తుంది. దుర్ఘటనలు, దురదృష్టకర ఘటనలు జరగాలని ఎవరూ కోరుకోరు కదా. నాకు తెలిసినంతవరకు యోగి ప్రభుత్వం కుంభమేళాను అద్భుతంగా నిర్వహిస్తోంది. కొన్ని సంఘటనలు జరగడం దురదృష్టకరం.
ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఎంతో రాజకీయ అనుభవం ఉన్న నేతలకు చెబుతున్నాను. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని నా అభిప్రాయం" అంటూ మమతా బెనర్జీ వ్యాఖ్యలను పవన్ తప్పుబట్టారు.