Somireddy Chandra Mohan Reddy: ఒక దుర్మార్గుడ్ని పరామర్శించడానికి జైలుకువెళ్లిన జగన్మోహన్ రెడ్డి కులాల గురించి మాట్లాడతాడా ?: సోమిరెడ్డి

- నేడు విజయవాడ జైల్లో వల్లభనేని వంశీని పరామర్శించిన జగన్
- అనంతరం కూటమి ప్రభుత్వంపై ఫైర్
- జగన్ మాటలను సొంత పార్టీ వారే నమ్మడం లేదన్న సోమిరెడ్డి
వైసీపీ అధినేత జగన్ ఇవాళ విజయవాడ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించడం తెలిసిందే. వంశీతో ములాఖత్ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో, జగన్ వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు.
ఒక దుర్మార్గుడ్ని పరామర్శించడానికి జైలుకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి కులాల గురించి మాట్లాడతాడా? అంటూ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి మాటలను అతని సొంత పార్టీ వారు కూడా సమర్ధించడం లేదని అన్నారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి జైలు వద్దకు వెళ్లి వార్నింగ్ ఇస్తాడా? అని సోమిరెడ్డి ఆగ్రహం వెలిబుచ్చారు.
"మనిషి అనే వాడు చేయని దుర్మార్గాలు వంశీ చేస్తే వెళ్లి ఆయన్ని పరామర్శించాడు. జగన్ తల్లి గురించి, చెల్లి పుట్టుక గురించి విమర్శలు చేసిన వర్రా రవీంద్రా రెడ్డి కూడా జైల్లో ఉన్నాడు... వెళ్లి అతన్ని కూడా పరామర్శిస్తాడా? సమాజంలో ఎంతోమంది నాయకుల్ని, ముఖ్యమంత్రులను చూశాం... జగన్ లాంటి దుర్మార్గపు ఆలోచనలు ఉన్న వ్యక్తిని మాత్రం చూడలేదు" అంటూ సోమిరెడ్డి ధ్వజమెత్తారు.